పోస్టుల భర్తీకి హైకోర్టు ఉద్యోగ ప్రకటనలు
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో దిగువస్థాయి పోస్టుల భర్తీకి హైకోర్టు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డు అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీల్లో మొత్తం 1,539 పోస్టులకు ఉమ్మడి నియామక ప్రక్రియ కింద 9 నోటిఫికేషన్లు వెలువరించింది.
సెప్టెంబరు 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
ఈ పోస్టులకు సెప్టెంబరు 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఆన్‌లైన్ దరఖాస్తు రెండు దశల్లో ఉంటుంది. తొలి దశలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, రెండో దశలో దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి. ఉద్యోగ ప్రకటనలు, నియామక విధానం సమాచారాన్ని తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపికలు జరుగుతాయి.
పూర్య జిల్లా కేంద్రంగా నియామకాలు
పూర్వ జిల్లా కేంద్రంగా జిల్లా కోర్టుల పరిధిలో నియామకాల్ని హైకోర్టు చేపట్టనుంది. ఏడో తరగతి నుంచి డిగ్రీ విద్యార్హత వరకూ వివిధ పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఆఫీసు సబార్డినేట్ పోస్టులు 686 ఉన్నాయి. ఈ పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులు లేదా పదో తరగతి ఫెయిలైన అభ్యర్థులు మాత్రమే అర్హులు. అంతకు మించి అర్హతలు కలిగిన వారిని ఎంపిక చేయబోమని నియామక ప్రకటనలో స్పష్టం చేశారు.