విద్యార్థులకు ట్యాబ్‌లు
కేరళలో జూన్‌లోనే విద్యా సంవత్సరం మొదలైంది. అక్కడ ఉపాధ్యాయులూ, విద్యార్థులూ ఆన్‌లైన్ క్లాసులకు సిద్ధమయ్యారు. అయితే కొందరు పేద విద్యార్థుల దగ్గర పాఠాలు వినేందుకు అవసరమైన సాధనాలు లేవని గుర్తించారు ఉపాధ్యాయుడు పీకే వినోద్ కుమార్. కోళికోడ్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేసిన వినోద్ ఏప్రిల్‌లో వీఆర్‌ఎస్ తీసుకున్నారు. గొంతు నొప్పితో బాధపడుతుండటంతో అయిష్టంగానే, విద్యార్థుల మేలు కోరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయ మిత్రుల్లో కొందరు తమ విద్యార్థులకు డిజిటల్ సాధనాలు లేక ఇబ్బంది పడుతున్నారని మాట్లాడుకోవడం విన్నారు వినోద్. వారికి సాయం చేయాలనుకున్నారు. సమీపంలోని స్కూళ్లకు ఫోన్‌చేసి ట్యాబ్‌లు అవసరమైన 18 మంది పేద విద్యార్థుల్ని గుర్తించి తన రిటైర్మెంట్ సొమ్ము నుంచి రూ.2 లక్షలు విలువ చేసే ట్యాబ్‌లు కొనిచ్చారు. ‘మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను ఎంతో మంది సాయం పొంది ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇస్తున్నా’ అని చెబుతారు వినోద్.
మొక్కలతో పాఠాలు
అనంతపురం జిల్లా రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన సదాశివయ్య మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు మొక్కలన్నా, పాములన్నా ప్రాణం. వాటి సంరక్షణ, జీవవైవిధ్యం కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. సదాశివయ్య తన పరిశోధనతో మూడు మొక్కల్ని కనుగొన్నారు కూడా. ఆయనకు పాముల్ని పట్టుకోవడంలో నైపుణ్యం ఉంది. దీన్లో యువతకు శిక్షణ ఇస్తారు కూడా. వారితో 2015లో ‘అసోసియేషన్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఏబీసీడీ)’ను స్థాపించారు. పాములన్నీ విషపూరితం కాదంటూ వాటి వల్ల రైతులకీ, పర్యావరణానికీ కలిగే ప్రయోజనాల్ని వివరిస్తారు. విద్యార్థులకు వృక్షశాస్త్ర పాఠాలు బోధించేందుకు గతేడాది ఆగస్టులో కళాశాల ప్రాంగణంలో ముప్పావు ఎకరాలో మొక్కలు నాటారు. ఇక్కడ 800 వరకు అరుదైన మొక్కలను పెంచుతున్నారు. వాటిని చూపిస్తూ పాఠాలు బోధిస్తుంటారు. 2020 మార్చిలో మరో అయిదెకరాల స్థలంలో తెలంగాణ బొటానికల్ గార్డెన్‌కు శ్రీకారం చుట్టారు. దానికి సొంతంగా రూ.1.5 లక్షలు వెచ్చించి కంచె ఏర్పాటుచేశారు. సదాశివయ్య కృషిని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఫోన్‌చేసి హైదరాబాద్ పిలిచి మాట్లాడారు. బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేయించారు.
కాలేజీలో మధ్యాహ్న భోజనం
మంత్రవాది రఘురాం జడ్చర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడు. ఆయన ఆ కాలేజీకి వచ్చేనాటికి అక్కడ 75 మంది విద్యార్థులే ఉండేవారు. ఇందుకు పేదరికం, సౌకర్యాల లేమి... ఇలా చాలా కారణాలున్నాయి. దూర ప్రాంత విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పాఠాలు వినటం రఘురాంని కలచివేసింది. వారికోసం 2018 నుంచి మధ్యాహ్న భోజనానికి శ్రీకారం చుట్టారు. తన ఇంటినే వసతిగృహంలా మార్చి 30 మంది నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించారు. వీటి కోసం రూ.3 లక్షలు ఖర్చుచేశారు. ఆపైన రూ.4 లక్షలు వెచ్చించి కళాశాలలోని పాత భవనానికి మరమ్మతులు చేయించి కళాశాల రూపురేఖల్ని మార్చేశారు. 2019-20 విద్యా సంవత్సరంలో 375 మంది కొత్త విద్యార్థులు చేరారు. తమ కాలేజీలో చదువుకున్నవారిలో సివిల్స్‌ని లక్ష్యంగా నిర్దేశించుకున్న ప్రతిభావంతులైన విద్యార్థుల్ని హైదరాబాద్‌లోని ఓ ప్రఖ్యాత శిక్షణ సంస్థలో చేర్పించారు. వాళ్లు డిగ్రీ చదువుతూ శిక్షణ తీసుకుంటున్నారు. రఘురాం సేవల గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన నిధులతో విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజన ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల రఘురాంను పిలిచి అభినందించారు కూడా. ఆయన ప్రయత్నంవల్ల మధ్యాహ్న భోజనం ప్రాధాన్యం తెలిసిందంటూ అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రఘురాం కోరిక మేరకు జడ్చర్లలోని కళాశాలకు కొత్త భవనాన్ని మంజూరు చేశారు.