గ్రేటర్ వ్యాప్తంగా నీటి బిల్లుల వసూళ్లపై కరోనా ప్రభావం పడింది. మే నెలకు సంబంధించి జలమండలి రెవెన్యూ రూ.65 కోట్లు దాట లేదు. లాక్‌డౌన్ తర్వాత ఏప్రిల్, మే మాసాల్లో నీటి బిల్లుల పంపిణీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు నెల నీటి బిల్లులనే కట్టాలని జలమండలి ప్రజలకు సూచించింది. చాలామంది వివిధ కారణాలతో బిల్లులు చెల్లించలేదు. ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం భారీగా తగ్గింది.
గ్రేటర్ వ్యాప్తంగా పది లక్షల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు నీటి బిల్లులు, కొత్త కనెక్షన్ల జారీ ద్వారా జలమండలికి రెవెన్యూ వస్తోంది. కరోనాతో దాదాపు రూ.35-40 కోట్లు ఆదాయం కోల్పోవడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి నిత్యం 420 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఇందుకు నెలకు రూ.75 కోట్ల వరకు కరెంటు ఖర్చవుతుంది.
ఆదాయం తగ్గడంతో గత రెండు నెలల నుంచి ఒక్క పైసా కూడా విద్యుత్తు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఈ బాకీలు భారీ స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం జలమండలి చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు రూ.1300 కోట్లకు చేరాయి. వీటిపై 11 శాతం వరకు వడ్డీ భారం ప్రతి నెలా పడుతోంది.
కేటగిరి మారితేనే...
ప్రజలకు సబ్సిడీతో నీటిని సరఫరా చేస్తున్న జలమండలికి మాత్రం వాణిజ్య కేటగిరిలో విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ప్రతి యూనిట్‌కు బోర్డుపై రూ.7 పైనే భారం పడుతోంది. కేటగిరీ మార్చాలని అధికారులు పదేపదే కోరిన మీదట గతంలో కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
- ఇదీ చూడండి: మహారాష్ట్రలో లక్షకు చేరువలో కరోనా కేసులు