ఈటీవీ భారత్ : ప్రతిష్ఠాత్మక హెచ్‌సీయూ ఉపకులపతిగా మీ ముందున్న లక్ష్యాలేమిటి?
ప్రొ.బీజేరావు: ప్రస్తుతం అకడమిక్, నాన్‌అకడమిక్, విద్యార్థులు, సిబ్బంది.. ఇలా కేటగిరీలవారీగా సమస్యలు తెలుసుకుంటున్నా. వాటి పరిష్కారానికి కృషిచేస్తా. ఉపకులపతిగా నా ముందు మూడు లక్ష్యాలున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం అమలుచేయాల్సి ఉంది. ఏడాదిన్నర కిందట వర్సిటీకి విశిష్ఠ(ఎమినెన్స్) హోదా వచ్చింది. అందులో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను దశలవారీగా ముందుకు తీసుకెళ్లాలి. 2024లో యూనివర్సిటీ 50ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తాం.
ఈటీవీ భారత్ : ఈ విద్యాసంవత్సరం నుంచే జాతీయ విద్యా విధానం అమలుచేసే అవకాశం ఉందా?
బీజేరావు: ఈ ఏడాదే ప్రారంభించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు అమలు చేయవచ్చు? ఏయే అంశాలను తొలుత ప్రారంభించాలనే విషయంపై మేథోమదనం చేసి అమలుచేస్తాం.
ఈటీవీ భారత్ : ప్రస్తుతం ఆన్‌లైన్ బోధన విద్యార్థులందరికీ చేరడంలేదు. దీని బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
బీజేరావు: కరోనా కారణంగా తప్పని పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో బోధనకు మొగ్గు చూపాం. గ్రామీణప్రాంత విద్యార్థులకు డిజిటల్ సదుపాయాలు సరిగా అందుబాటులో లేవు. వర్సిటీ నుంచి ఇప్పటికే డిజిటల్ యాక్సిస్‌గ్రాంటు పేరిట నెలకు రూ.1000 అందిస్తున్నారు. ఈ మొత్తం సరిపోతుందా? నిబంధనల ప్రకారం మరికొంత ఇచ్చేందుకు సాధ్యపడుతుందా? తదితర విషయాలను సమీక్షించి అమలుచేస్తాం.
ఈటీవీ భారత్ : విద్యార్థులను వెనక్కి పిలిచి ప్రత్యక్ష బోధన చేపట్టే వీలుందని భావిస్తున్నారా?
బీజేరావు: ఈ విషయంపై వర్సిటీ తరఫున టాస్క్‌ఫోర్సు బృందాన్ని గతంలో ఏర్పాటుచేసి కసరత్తు చేపట్టారు. బృందంతో సంప్రదించి ఏమైనా మార్పులు అవసరమైతే చేస్తాం. ఎంతమంది విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకున్నారో డాటా రూపొందించాలని టాస్క్‌ఫోర్సుకు సూచించాం. దాని ఆధారంగా విద్యార్థులను వర్సిటీకి పిలిపించే చర్యలుంటాయి. వేరే విద్యాసంస్థలల్లోనూ ఈ తరహా కసరత్తు జరుగుతోంది.
ఈటీవీ భారత్ : పరిశోధనలకు హెచ్‌సీయూ కేంద్ర బిందువు. ఆచార్యులు, పరిశోధక విద్యార్థులకు మీ నుంచి ఎలాంటి సహకారం లభించనుంది.?
బీజేరావు: లైఫ్‌సైన్సెస్‌లోనే కాకుండా సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహిస్తాం. ప్రస్తుతం వర్సిటీలో పరిశోధనలపరంగా ఉన్న వసతులను సమీక్షించుకుని విభాగాలవారీగా మరింత బలోపేతమయ్యేందుకు ఏమేం అవసరమో సమకూర్చుతా. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సామర్థ్యాలను బేరీజు వేసుకుని పరిశోధనలకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలు తీసుకొస్తా.