సికింద్రాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలోని బౌద్ధనగర్‌లోని ఓ కుటుంబంలో కరోనా విషాదం నింపింది. బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ... ఇటీవల కరోనా బారిన పడ్డారు. 22వ తేదీన చాతిలో నొప్పి రాగా... హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు... అప్పటికే లక్ష్మీనారాయణ మరణించినట్లు ధ్రువీకరించారు. తీవ్ర మనోవేదనకు గురైన భార్య రూపాదేవి... భర్త మరణాన్ని తట్టుకోలేక పోయింది.
రెండు రోజుల క్రితం ఆమెలోనూ... కరోనా లక్షణాలు కనిపించడం వల్ల పరీక్ష చేయించుకుంది. ఈరోజు ఉదయం ఆమెకు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. ఒకవైపు భర్త మరణం... మరోవైపు తనకు కరోనా సోకడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైంది. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తనను బలి తీసుకునే అవకాశం కరోనాకు ఇవ్వకూడదని ఆలోచించి ఆవేశంలో ప్రాణం తీసుకున్న ఆ పిచ్చితల్లి... తన పిల్లలు దిక్కులేని వారవుతారని ఆలోచించలేకపోయింది. వారం వ్యవధిలోనే దంపతులిద్దరు మరణించటం... బంధువులు, స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.