కరోనా వైరస్ విజృంభణతో అనేక మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. దినసరి కూలీలు, పేదల పూటగడవడమే కష్టంగా మారుతోంది. ఆ గడ్డుపరిస్థితుల్లో పలువురు ఉదారతను చాటుతున్నారు. తమకు తోచినంతలో సాయంచేస్తూ అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 'ఆహార్‌సేవా సంస్థ' అల్పాహారం, భోజనం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటోంది. పాతబస్తీలోని పేట్లబుర్జు, నీలోఫర్ ఆసుపత్రి, పబ్లిక్ గార్డెన్‌తో పాటు పాటు వివిధ ప్రాంతాల్లో అల్పాహారం, భోజనం పంపిణీ చేస్తోంది.
కరోనా సోకి ఇబ్బందిపడుతున్న వారికి వీఎన్నార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం అందిస్తున్నారు. ట్రస్ట్ ఛైర్మన్ ఇంట్లో భోజనం వండి సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి, న్యూ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో పంపిణీచేశారు. సంగారెడ్డిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వెంట ఉన్నవారు, అనాథలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అక్షయపాత్ర వారి సౌజన్యంతో రోజుకు 500 మంది వరకు అన్నదానం చేశారు. సంగారెడ్డిలో కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి శ్రుతి సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇంటివద్దకే పంపిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో 'మంథని మిత్ర' ఆధ్వర్యంలో వలస కూలీలు, కరోనా బాధితులకు ఆహారం పంపిణీచేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న అనాథలు, యాచకులకు పండ్లు పంపిణీ చేసి వరంగల్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలలో మూసివేతతతో.. ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో 100 మందికిపైగా టీచర్లకు ఈ సాయాన్ని పంపిణీ చేశారు.