ETV Bharat / city

moral stories in telugu: అమ్మలూ మీరు ఇలాగే చేస్తున్నారా.. ఓసారి ఆలోచించండి! - తెలంగాణ వార్తలు

కొడుకుల పెళ్లికాగానే చాలామంది అమ్మలు మారిపోతుంటారు. కోడలు ఇంటికి రాగానే వారిలో ఒకరకమైన ఆలోచన వస్తుంది. కొడుకు ఏం చేసినా... ఏం చేయకపోయినా మారిపోయావ్ అంటూ ఆ అమ్మలు హైరానాపడతారు. అటువంటి తల్లుల కోసమే ఈ స్టోరీ(moral stories in telugu)... ఇది చదివాక మీరూ ఓసారి ఆలోచించండి...

moral stories in telugu, amma story
అమ్మపై స్టోరీ, తెలుగు స్టోరీ 2021
author img

By

Published : Oct 24, 2021, 9:04 AM IST

హైదరాబాద్‌ నుంచి ఎప్పుడొచ్చావు వదినా?’’ ఫంక్షన్‌ హాల్లో కనబడిన దూరపు బంధువు సరోజనమ్మను దగ్గరగా వెళ్లి పలకరించింది సురేఖ.
భర్త సురేందర్‌తో కలిసి బంధువుల అమ్మాయి వివాహ వేడుకకు ఉమాశంకర్‌ ఫంక్షన్‌హాల్‌కి వచ్చింది సురేఖ.
‘‘జగిత్యాలకు పొద్దున్నే వచ్చాను. ఎన్నాళ్లైంది మనం కలుసుకుని... బాగున్నావా వదినా?’’ కుశల ప్రశ్నలు వేసింది సరోజనమ్మ.
ఆప్యాయంగా ఆమె చేతిలో రెండుచేతులూ కలుపుతూ తలాడించింది సురేఖ. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు.
‘‘ఏమంటున్నాడు మనవడు?’’
‘‘పది నెలలు నిండాయి కదా! ఇప్పుడిప్పుడే లేచి నిలబడుతున్నాడు. కొడుకూ కోడలూ మొన్న పండక్కి వచ్చి వారం రోజులుండి వెళ్లారు వదినా’’ అంటూ కాసేపు మనవడి కబుర్లన్నీ మురిపెంగా చెప్పుకుంది సురేఖ.
మాటల సందర్భంలో ‘‘చెప్పడం మర్చి పోయాను... పదిరోజుల క్రితం వెస్ట్‌ మారేడ్‌పల్లి సీతాయమ్మ చిన్న మనవరాలి వరపూజలో మీ పెద్ద వియ్యంకురాలు కలిసింది. కూతురు స్తోత్ర వాషింగ్‌ మిషను కొనిచ్చిందని తెగ సంబరపడుతూ చెప్పిందనుకో’’ అంది ఆవిడ.
ఆ మాట విన్న సురేఖ కుతకుతలాడిపోయింది.
ఆ తర్వాత సరోజనమ్మ ఏం చెబుతున్నా చెవికి ఎక్కలేదు. ఆలోచనలన్నీ వారం క్రితం జరిగిన సంఘటన మీదికి వెళ్లాయి. ఆరోజు- ‘‘కోడలు పిల్ల వ్యవహారం నాకేం నచ్చడం లేదురా’’ పెద్దకొడుకు అలోకిత్‌ మీద అంతెత్తున ఎగిరిపడింది సురేఖ.
‘‘ఏం చేసిందమ్మా’’
అన్నాడు అలోకిత్‌.
‘‘చేయాల్సిందంతా చేసి... ఇంకా ఏం తెలియనట్టు నన్నడుగుతావేం?’’ రుసరుస లాడింది సురేఖ.
‘‘అమ్మా, ఏదైనా ఉంటే స్ట్రెయిట్‌గా మాట్లాడు. ఈ డొంకతిరుగుడు దేనికమ్మా’’ చాలా కూల్‌గా అడిగాడు అలోకిత్‌.
‘‘అలా గుండ్రాయిలా పేపర్‌ ముందేసుకుని కూర్చోకపోతే మాట్లాడొచ్చుగా’’ భర్తవంక కోపంగా చూసింది సురేఖ.
‘‘తల్లీ కొడుకులిద్దరూ మాట్లాడు కుంటున్నారుగా... మధ్యలో నేనెందుకట?’’ నన్ను లాగకండి అన్నట్టు తిరిగి పేపర్లో తల దూర్చాడు సురేందర్‌.
‘‘మీతో నాకెప్పుడూ ఇంతే. ఏదీ పైకి అనరు. అనవసరంగా నన్ను ముందుకు తోస్తుంటారు. పిల్లలముందు డాడీ మంచోడు, అమ్మ చెడ్డది అవుతోంది’’ భర్త మీద కోపం ప్రదర్శించింది.

అమ్మ చెబితే వినాలి

‘‘మన పిల్లల ముందు మనం చెడ్డవాళ్లం అవడం ఏమిటి సురేఖా? అయిన దానికీ కాని దానికీ నువ్వే అనవసరంగా ఆవేశపడుతుంటావు. ఆ తర్వాత, ఇలా ఎందుకు అన్నానా అని బాధ పడుతుంటావు. నీకిది మామూలేగా’’ భార్యను సముదాయించే ప్రయత్నం చేశాడు సురేందర్‌.
‘‘మీరు నోరు మెదపనప్పుడు నేనైనా విషయం కదపాలి కదా. మీరు కలుగజేసుకోనప్పుడు అన్ని పనులూ చక్కదిద్దాల్సిన బాధ్యత నాదేగా’’ అంది ఉక్రోషంగా.
ల్యాప్‌టాప్‌ మీద కదులుతున్న చేతివేళ్లను ఆపి ‘‘అమ్మా చిన్నదానికీ పెద్దదానికీ అనవసరంగా హైరానాపడతావెందుకు? ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నయ్యకు తెలియదా. తనేమైనా చిన్న పిల్లోడా? పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇరవై మంది ఉన్న ఒక బ్యాచ్‌కి లీడర్‌. వదిలేయ్‌’’ అన్నాడు చిన్నకొడుకు అన్విత్‌.
‘‘నోర్ముయ్‌, నువ్వు జాబ్‌లో చేరి మూడు నెలలు అయిందో కాలేదో, అప్పుడే నాకు సలహాలు ఇస్తున్నావా?’’ చిన్న కొడుకు మీద గయ్‌మని లేచింది సురేఖ.
విషయం తేలేదాకా అమ్మ మొండిపట్టు వదలదని ఎరిగిన అన్విత్‌ తిరిగి తన ల్యాప్‌టాప్‌కి కనెక్ట్‌ అయిపోయాడు.
‘‘మొన్న మా చిన్న తమ్ముడు సతీష్‌ మీ అపార్ట్‌మెంటుకి వచ్చాడట కదా?’’ పెద్దకొడుకుని ఆరా తీసింది సురేఖ.
‘‘అవును, వాళ్ల అబ్బాయిని హైదరాబాద్‌ బౌరంపేట చైతన్య క్యాంపస్‌లో ఇంటర్‌లో జాయిన్‌ చేయడానికి వచ్చాడట. వెళుతూ మన చిన్నోడిని చూసిపోదామని వచ్చాడు. బలవంతం చేస్తేనే చిన్న మామయ్య నా దగ్గర భోంచేసి వెళ్లాడు.’’
‘‘అదికాదు నేను అడిగేది.’’

అమ్మ చెబితే వినాలి

‘‘మరి నాకు తెలియనిది, నేనెలా చెప్పాలమ్మా’’ అలోకిత్‌ గొంతులో కాస్త అసహనం చోటు చేసుకుంది.
‘‘మీ అత్తామామలు ఇద్దరూ నీ దగ్గరే ఉంటున్నారటగా’’ అడిగింది.
అమ్మ మనసులోని మాట బయటపడేసరికి ‘‘అవును, వాళ్లు మా అపార్ట్‌మెంట్‌కి వచ్చి నెల అవుతోంది’’ జవాబిచ్చాడు అలోకిత్‌.
‘‘ఇంతవరకూ మాకా విషయం చెప్పనేలేదేం?’’ సూటిగా ప్రశ్నించింది సురేఖ.
‘‘ఇందులో చెప్పడానికి ఏముందమ్మా?’’ ఆశ్చర్యపోయాడు అలోకిత్‌.
భర్త వంక చూస్తూ ‘‘చూశారా మీ పెద్దకొడుకు నిర్వాకం... మనకు చెప్పాల్సిన పనే లేదట’’ అంది నిష్టూరంగా.
భార్య అనవసరంగా సాగతీయడం నచ్చని సురేందర్‌ ‘‘ఇప్పుడు చెప్పాడుగా సురేఖా’’ అంటూ కొడుకుని సమర్థించాడు.
‘‘ఆఁ... అడిగితే చెప్పాడు లెండి. అయినా ఎన్నాళ్లుంటారట?’’ తిరిగి కొడుకుని ప్రశ్నించింది.
‘‘చిన్నోడు వాళ్ల అమ్మమ్మకి బాగా మాలిమి అయ్యాడమ్మా. స్తోత్ర కూడా హ్యాపీగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేసుకుంటోంది... వాడి నుంచి ఎలాంటి డిస్ట్రబెన్స్‌ లేకుండా’’ క్లియర్‌గా విషయం చెప్పాడు అలోకిత్‌.
అదేమీ పట్టించుకోకుండా ‘‘నేను అడిగిన దానికి సమాధానం రాలేదు. వాళ్లిద్దరూ నీ దగ్గర ఎన్నాళ్లు ఉంటారు? తిరిగి రెట్టించింది.
‘‘చిన్నోడు ఇప్పుడిప్పుడే బోర్లా పడుతున్నాడు కదమ్మా. వాళ్లమ్మ సహాయం లేకుండా, అటు జాబ్‌నీ ఇటు పిల్లాడినీ వంటపనుల్నీ స్తోత్ర ఒక్కతే చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది. నేను ఎంత స్తోత్రకి సహాయపడుతున్నా మా ఇద్దరి వల్లా కావడం లేదమ్మా. ఉండనీ, ఎన్నిరోజులని ఏముంది?’’ తల్లికి నచ్చచెప్పాడు అలోకిత్‌.
‘‘ఇదేమైనా అమెరికానా అత్తమామల్ని రప్పించుకుని ఇంట్లో ఉంచుకోవడానికి, మన బంధువులు నలుగురూ నానా మాటలు అంటుంటే నాకు అదోలా అనిపిస్తోంది’’ అసహనం వ్యక్తం చేసింది.
‘‘ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏముందమ్మా? వాళ్లెవరో ఈ ఇష్యూ గురించి మాట్లాడడం కూడా విడ్డూరంగా ఉంది.’’
‘‘మనం చేసే పనులు కొత్తగా వింతగా ఉన్నప్పుడు పదిమంది పలు రకాలుగా అనుకోవడంలో తప్పేముంది.’’
అమ్మ అర్థం చేసుకోలేకపోవడం, దీన్ని రాద్ధాంతం చేయడం నచ్చడం లేదు అలోకిత్‌కి.
‘‘పోనీ, ఆ పది మంది ఎవరో వచ్చి స్తోత్రకు హెల్ప్‌ చేయమను. వాళ్ల పేరెంట్స్‌ ఇద్దరూ వెనక్కి వెళ్లిపోతారు’’ అన్నాడు గట్టిగా.
కొడుకు ముఖ కవళికలు మారుతూ ఉండడం గమనించిన సురేఖ ‘‘అది కాదు నాన్నా, మీరిద్దరూ ఎలాగూ ఒంటరిగా ఉంటున్నారు. వాళ్లు మీ ఇంటికి వచ్చి ఉండడం కాకుండా మిమ్మల్నే తీసుకెళ్లి వాళ్లింట్లోనే ఉంచుకోవచ్చు కదా. వాళ్లకు మాత్రం స్తోత్ర తప్ప ఎవరున్నారు?’’ అంది నింపాదిగా.
ఆమె తన ఆలోచనను కొడుకు ముందు వ్యక్తపరచడంతో ‘‘ఆ ఇంట్లో ఈ ఇంట్లో అని ఏముందమ్మా? ఎక్కడైనా ఒకటేగా. పైగా మా ఇద్దరి ఆఫీసులకూ దగ్గరనే కదా సిటీకి అంత దూరంగా అపార్ట్‌మెంట్‌ తీసుకుని ఉంటున్నది’’ అన్నాడు.
‘‘అమ్మ చెబితే వింటావనుకున్నాను. ఏమో, ఈ మధ్య నేను ఏది చెప్పినా నీకు చెవికి ఎక్కడం లేదు’’ అంది నిరసనగా.
‘‘ఎందుకమ్మా అనవసరంగా అపోహ పడతావు. నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? స్తోత్ర నాకు అన్నివిధాలా సరిజోడీ అని నువ్వు నిర్ణయించాకే కదా నేను తలూపాను. నువ్వు సెలెక్ట్‌ చేసిన సంబంధాన్నే కదమ్మా నేను హ్యాపీగా చేసుకున్నది’’ తల్లిని కూల్‌ చేయబోయాడు.
‘‘అది పెళ్లికి ముందు సంగతి. ఇప్పుడలా జరగడం లేదులే. నీకెలా తోస్తే అలా చేసుకుంటున్నావు’’ మొహం ముడుచుకుంది సురేఖ.
‘‘ఇప్పుడూ ఎప్పుడూ ఇంట్లో నీ మాటే నెగ్గుతుంది. నువ్వేం వర్రీ అవకు అమ్మా. ఇప్పుడే స్తోత్రకి ఫోన్‌ చేసి వాళ్ల అమ్మానాన్నలని వాళ్లింటికి పంపించేయమంటాను. నేను కూడా హైదరాబాద్‌ వెళ్లి స్తోత్రను వెంటనే జగిత్యాలకు తీసుకువస్తాను.
మా ఇద్దరికీ వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కదా, నో ప్రాబ్లమ్‌... ఆఫీస్‌ పని ఎక్కడైనా చేసుకుంటాం. అయితే పిల్లాడిని చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి’’ అంటూ తల్లిని ఇరకాటంలో పడేశాడు అలోకిత్‌.
కొడుకు మాటలకు కంగారు పడింది సురేఖ.
‘‘అదెలా కుదురుతుందిరా... చిన్నోడితో అంత టైం స్పెండ్‌ చేయడానికి నేనేం ఖాళీగా ఉండడం లేదు కదా. ఇక్కడ ఇంత పెద్ద వర్కు నడుస్తోంది. అన్నీ తెలిసే అలా అంటావేంటి?’’
‘‘మరి నీకూ వీలుపడక- వాళ్లనూ రావద్దంటే పిల్లాడిని ఎవరు చూడాలి? వాళ్లేం తినడానికి లేక రాలేదు. వాళ్ల పనులన్నీ పక్కన పెట్టి మరీ మాకోసం వచ్చారు. చిన్నోడి బాగోగులు చూసుకుంటున్నారు.’’
‘‘ఆఁ అర్థమైంది. పిల్లాడి మీద నాకూ మీ నాన్నకూ ప్రేమ లేదు. మీ అత్తామామలే మంచివాళ్లని చెబుతున్నావు, అంతేగా’’ అంటూ విరుచుకు పడింది సురేఖ.
తల తిప్పకుండానే ఓరకంటితో కొడుకు వంక జాలిగా చూశాడు సురేందర్‌.
అన్విత్‌ వాళ్ల మాటల్ని వినకుండా తన ఆఫీసు పనిలో నిమగ్నమైపోయాడు.
ఇది ఇప్పట్లో తెగేలా లేదని ‘‘అమ్మా అనవసరంగా అన్నీ నెగటివ్‌గా ఊహించుకోకు. నాకు నీ తర్వాతే స్తోత్ర అయినా మరెవరైనా. అది గుర్తుపెట్టుకో’’ అంటూ తల్లిని కట్టిపడేశాడు అలోకిత్‌.
మరేం మాట్లాడలేదు సురేఖ.
‘‘ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కి వెళ్తానమ్మా’’ తల్లికి చెప్పాడు అలోకిత్‌.
‘‘సరేగానీ, ఈసారి పండక్కి మాత్రం కోడలిని తప్పక తీసుకురా... చిన్నోడిని చూడాలనిపిస్తోంది.’’
‘‘ఒకటి రెండు రోజుల కోసం స్తోత్ర ప్రయాణానికి ఇబ్బంది పడుతుందేమో? అయినా వీడియోలో రోజూ వాడిని చూస్తూనే ఉన్నావు కదా’’ కొడుకు మాటలకు చురుక్కుమంది సురేఖకు.
‘‘అవును మరి... మీరుంటున్నది అమెరికాలో, మేముంటున్నది ఇండియాలో. అక్కడ హైదరాబాదులో కారు కదిలిందంటే మూడున్నర గంటలకల్లా జగిత్యాల చేరుకుంటారు. పండక్కి కూడా కోడలూ, మనవడూ నా దగ్గర ఉండకపోతే ఎలా? ఉండనీ ఇక్కడే పది, పదిహేను రోజులు.’’
‘‘మరి వాళ్ల అమ్మానాన్నలని కూడా రమ్మననా... స్తోత్రకి ఆఫీసుపని ఉంటుంది’’ అంటూ అంగీకారం కోసం తండ్రి వైపు కూడా చూశాడు.
భార్య చూడకుండా భుజాలు ఎగురవేశాడు సురేందర్‌.
‘‘నీ కంటికి నేనెలా కనబడుతున్నాన్రా... ఆ మాత్రం పదిరోజులు పిల్లావాడిని నేను చూసుకోలేనా?’’ కొడుకుని గదమాయించింది సురేఖ. అలోకిత్‌ నిశ్శబ్దమై పోయాడు.
‘‘కోడలికి ఇష్టమని బూందీ లడ్డూలూ, నీకు ఇష్టమైన సన్న కారప్పూసా చేయించాను. అలాగే కొన్ని ఫ్రూట్స్‌ కూడా తెచ్చారు నాన్న. లగేజీ గురించి కొడుకుతో చెప్పింది సురేఖ.
‘‘అలాగేనమ్మా, నాతో చెప్పడం దేనికి... అవన్నీ కార్లో సర్దించు. ఈలోగా ఫ్రెండ్స్‌ని కలిసి వస్తాను’’ అంటూ బైక్‌ తీసుకుని బయటకు నడిచాడు అలోకిత్‌.
పక్కన ఏదో శబ్దం కావడంతో ఆలోచనల్లోంచి బయటపడింది సురేఖ. మాంగల్యధారణ పూర్తయి, వధూవరులను ఆశీర్వదించడానికి జనం వేదిక వైపు కదులుతుండడంతో సరోజనమ్మకి ‘బాయ్‌’ చెప్పి భర్త దగ్గరకు వెళ్లింది.

* * *

‘‘మీ అత్తింటివారు ఎలాగూ బంధువులందరినీ పిలిచి బారసాల ఘనంగా చేయలేక పోయారు. వాళ్ల కుటుంబం, మన కుటుంబం మధ్య హైదరాబాద్‌లో మమ అనిపించారు. కనీసం నా మనవడి ఫస్ట్‌ బర్త్‌డేని నన్నైనా జగిత్యాలలో గ్రాండ్‌గా చేసుకోనివ్వు’’ అంటూ కొడుకుకి ఫోన్‌ చేసింది సురేఖ.
సరేనంటూ ‘‘అయినా అమ్మా... స్తోత్రకి పెద్దాపరేషన్‌ జరిగి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మామయ్య ఫంక్షన్‌ చేయలేక పోయారు కదా. ప్రతిదానికీ ఏదో మెలిక పెట్టి వాళ్లను అవమానిస్తావు ఎందుకు?’’ తల్లిని చిన్నగా మందలించాడు అలోకిత్‌.
మూతి ముడుచుకుని ‘‘మీరైతే ఓ పదిరోజుల ముందు రండి’’ అంటూ ఫోన్‌ పెట్టేసింది సురేఖ.
ఫంక్షన్‌ హాల్‌నూ వంటవాడినీ వెంటనే బుక్‌ చేయమని సురేందర్‌ని పురమాయించింది.
భర్తనీ, చిన్న కొడుకునీ, కోడలినీ కూర్చోబెట్టి ఫంక్షన్‌కి కావాల్సిన మెనూని పేపర్‌ పైన రాయించింది. మధ్య మధ్యలో పెద్దకొడుకూ కోడలు సలహాలు కూడా తీసుకుంది.

* * *

అమ్మ చెబితే వినాలి

మనవడు వచ్చి రెండు రోజులు అవుతుందో లేదో నానమ్మకి బాగా మాలిమి అయిపోయాడు.
‘‘అసలు వాడిని వదిలి ఒక్క క్షణం ఉండలేకపోతున్నానండీ. తడబడుతూ ఒక్కో అడుగూ పడుతుంటే, చేతికి దొరికినవి అందుకోవాలనే తాపత్రయం, అల్లరి చేష్టలు... ముమ్మూర్తులా చిన్నప్పటి అలోకిత్‌ని గుర్తుకు తెస్తున్నాయి’’ అంటూ మురిసిపోతున్న సురేఖని చిరునవ్వుతో చూశాడు సురేందర్‌.
ఆరోజు శుక్రవారం కావడంతో పిల్లవాడికి తలారా స్నానం చేయించి, బట్టలు తొడిగి, చక్కగా ముస్తాబు చేసి హాల్లోకి ఎత్తుకుని వచ్చిన స్తోత్ర ‘‘ఏదీ ఒకసారి జేజికి దండం పెట్టు’’ గోడకి వేలాడదీసిన క్యాలెండర్ల వైపు చూపిస్తూ కొడుక్కి చెప్పింది.
మనవడిని ఆసక్తిగా చూస్తున్నారు నానమ్మా తాతయ్యలు.
వాడు చప్పున తల ఇటువైపు తిప్పి నానమ్మ కేసి చూస్తూ రెండు చేతులెత్తి దండం పెట్టాడు.
సోఫా నుంచి లేచిన సురేఖ మనవడి దగ్గరికి వెళ్లి బుగ్గలు నిమురుతూ క్యాలెండర్‌ వైపు వాడి తల తిప్పుతూ ‘‘జేజి... జేజికి దండం పెట్టు’’ అంది ప్రేమగా.
మళ్లీ వాడు తల ఈవైపే తిప్పి నానమ్మకి దండం పెట్టాడు.
‘‘అదేంటమ్మా? దేవుడికి దండం పెట్టమంటే వాడు నాకు పెడుతున్నాడేంటీ?’’ ఆశ్చర్యపోతూ అడిగింది కోడలిని.
బెడ్‌రూమ్‌లో నుంచి వస్తున్న అలోకిత్‌ తల్లి మాటలు వింటూ ‘‘అదంతే అమ్మా, నీ కోడలు వాడికి అలా నేర్పి వదిలేసింది. రోజూ మా దగ్గర నీ ఫొటో చూపిస్తూ, జేజికి దండం పెట్టమంటూ వాడికి అలా అలవాటు చేసింది’’ అన్నాడు నవ్వుతూ.
అది వింటున్న సురేఖకి నోట మాట రాలేదు. మనవణ్ణి కోడలు చేతుల్లోంచి తీసుకుని హృదయానికి హత్తుకుంటూ ప్రేమాతిశయంతో బోలెడన్ని ముద్దులు కురిపించింది.
మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక కాస్త నడుం వాల్చింది సురేఖ. కన్ను అంటుకుంటుండగా మొబైల్‌ మోగడంతో చేతుల్లోకి తీసుకుంది.
‘‘హాయ్‌, పెద్దమ్మా! పనులు ఎలా జరుగు తున్నాయి? ముందు వదినకి కాల్‌ చేశాను. ఎత్తకపోయేసరికి నీతో మాట్లాడుతున్నాను’’ ఫోన్‌లోనే నీహారిక గొంతు ఖంగుమంది.
‘‘పిల్లాణ్ణి తీసుకుని ఇప్పుడే బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. పడుకుందో, ఆన్‌లైన్‌ మీటింగ్‌ అటెండ్‌ అవుతోందో? అది సరే, వారం ముందుగానే నిన్ను వచ్చేయమని చెప్పాను కదే. ఇంకా బయలుదేరలేదా?’’ కోపంగా అడిగింది చెల్లెలు కూతుర్ని సురేఖ.
‘‘మళ్లీ కొత్తగా అడుగుతావేం పెద్దమ్మా... మా అత్తమ్మ గురించి నీకు తెలిసిందేగా అమె చెప్పిందే అందరూ వినాలి. ‘బర్త్‌డేలకి వారం ముందు అవసరమా, ఓ రోజు ముందు అబ్బాయీ నువ్వూ కలిసి వెళ్లండి చాలు’ అంటూ ఎప్పుడో బ్రేక్‌ వేసింది’’ నీహారిక గొంతులో నిరుత్సాహం కనబడింది.
తిరిగి ‘‘యు ఆర్‌ గ్రేట్‌ పెద్దమ్మా’’ సురేఖని అభినందించింది నీహారిక.
‘‘ఏంటే పొగడ్తలు మొదలుపెట్టావ్‌. ఈ బర్త్‌డేలకి ఆడబిడ్డలకు కట్నాలు ఉండవు, మళ్లీ మనవడి పెళ్లికే నీకు కట్నాలు ముట్టేది’’ అంటూ నవ్వింది.
‘‘అప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాలే గానీ, నీది ఎంత మంచి మనసు కాకపోతే స్తోత్ర వదిన... వాళ్ల అమ్మావాళ్లకి తన జీతం డబ్బులతో వాషింగ్‌మిషన్‌, ఫ్రిజ్‌, అంత పెద్ద టీవీ కొనిస్తుంది చెప్పు?’’
ఇవన్నీ స్తోత్ర తల్లికి కొనిపెట్టిందా... నీహారిక మాటలు సురేఖకి మింగుడుపడలేదు.
‘‘మా అమ్మ కూడా నా చదువుకోసం ఎంత తాపత్రయ పడిందో నీకు తెలుసుకదా పెద్దమ్మా. నేను బుక్కు వదలకుండా కూర్చుంటే నాతోపాటు రాత్రిళ్లు మేల్కొనేది. నేను చదువు ధ్యాసలో పడి ఒక్కోసారి తినకపోతే తనూ ఉపవాసం ఉండేది.
అలాంటి అమ్మకోసం నేనిప్పుడు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌చేస్తూ వేలకి వేలు సంపాదిస్తున్నా ఏమీ చేయలేని అశక్తురాలినయ్యాను... మా అత్తమ్మ చలవవల్ల’’ ఆమె గొంతు తడిబారడం ఫోన్లో తెలుస్తోంది సురేఖకి.
మొట్టమొదటిసారిగా నీహారిక మాటలు ఆమెను ఆలోచనల్లో పడేశాయి... తనకీ ఒక కూతురు ఉంటే తెలిసి ఉండేదేమో అనుకుంది.
‘‘కన్నవాళ్లు పాతిక సంవత్సరాల దాకా ఆడపిల్ల బరువు బాధ్యతలు మోసి ఒక ఉద్యోగస్తురాలిగా ఉన్నతస్థితికి చేర్చి అత్తారింటికి పంపగానే, ఆ అమ్మాయి సొమ్ముపైన హక్కు మొత్తం అత్తవారింటిది అవుతుందా?
ప్రయోజకురాలైన ఒక ఆడపిల్ల పెళ్లై మెట్టినింట అడుగుపెట్టాక తన తల్లిదండ్రుల గురించి ఏమీ పట్టించుకోకూడదా? వాళ్లకోసం ఏమీ చేయకూడదా?’’ నీహారిక తన కుటుంబ గోడు వెళ్లబోసుకున్నట్టుగా అనిపించలేదు.
తన తోటి ఆడపిల్లలు అందరి తరఫున నిలబడి సమాజాన్ని నిలదీస్తున్నట్లుగా అనిపించడంతో సురేఖ ఉలిక్కిపడింది.
‘‘ఈ టైమ్‌లో ఈ గోల ఎందుకుగానీ రెండు రోజుల్లో మా ఆయనతో కలిసి నేనక్కడుంటా. బాయ్‌ పెద్దమ్మా’’ అంటూ ఫోన్‌ పెట్టేసింది నీహారిక.
మొదట నీహారిక చెప్పిన మాట చెవిన పడ గానే సాయంత్రం పెద్దకొడుకుని పిలిచి దుమ్ము దులపాలి అనుకుంది సురేఖ. కానీ నీహారికతో ఫోన్‌ సంభాషణ ముగిశాక మెత్తబడిపోయింది.
‘నిజమే, తనూ భర్త ఇద్దరూ కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్లని వృద్ధిలోకి తెచ్చారు. ఆ హక్కుతోనే కదా, అప్పుడప్పుడూ తల్లిగా తన మాటే వినాలని పట్టుబడుతోంది. ఆడపిల్లయినా అంతేకదా, మరి.
ఒక పెళ్లైన ఆడపిల్ల తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ, పుట్టింటి చిన్నచిన్న అవసరాలు తీరిస్తే తప్పేమిటి?’’ అంటూ తొలిసారిగా సురేఖ ఆలోచనలు పాజిటివ్‌గా సాగాయి.
మనవడి ధ్యాసలో పడి ఒక్కోసారి సురేఖకి బయట గదిలో మగ్గం వర్క్‌ చేస్తున్న వర్కర్ల దగ్గరికి కూడా వెళ్లాలి అనిపించేది కాదు.
నానమ్మతో దోస్తానా బాగా పెరిగింది వాడికి. ఆమె తినిపిస్తేనే తినేవాడు.
తాతయ్య మనవడి కోసం తినడానికి బయటనుండి ఏదైనా కొనితెచ్చి ఒక ముక్క వాడి నోట్లో పెట్టబోతే, దాన్ని తీసుకెళ్లి నానమ్మ నోటికి అందించేవాడు.
నిజంగా సురేఖ గుండె గోదారై పొంగేది అలాంటి క్షణాల్లో.
‘‘మనవడి సమక్షంలో నిజంగా మైమరచి పోతున్నానండీ. నా పిల్లల విషయంలో కూడా ఇంతగా ఆనందాన్ని పొందలేదు. ఇన్ని రోజులు వీడిని ఎలా మిస్సయ్యానా అని ఇప్పుడు అనిపిస్తోంది’’ అంటూ భర్త సురేందర్‌తో చెబుతూ మురిసిపోతోంది సురేఖ.
‘‘నువ్వు ఎప్పుడూ ఇంతేగా సురేఖా? కోపం వచ్చినా ఆపలేం, నీ ఆనందాన్నీ పట్టలేం’’ అంటూ నవ్వి ఊరుకున్నాడు సురేందర్‌.
‘‘ఆఫీస్‌ వర్క్‌ లేకుంటే ఒకసారిలా వస్తావా స్తోత్రా’’ కోడలికి వినపడేలా పిలిచింది సురేఖ.
‘‘చెప్పండి అత్తమ్మా’’ బయటకు వచ్చింది స్తోత్ర.
బుజ్జిగాడి బర్త్‌డే రోజున, మీ అమ్మా నాన్నలకి మనం కొత్తబట్టలు పెడదాం, ఏమంటావు?’’ కోడలిని కదిపింది సురేఖ.
భర్త సురేందర్‌తో పాటూ, అక్కడున్న ఇద్దరు కొడుకులూ కోడళ్లూ ఆశ్చర్యపోయారు ఆవిడ సరికొత్త సంప్రదాయానికి తెరతీస్తూ మాట్లాడుతున్న మాటలకు.
‘‘మీరెలా చెబితే అలా’’ బదులిచ్చింది స్తోత్ర.
‘‘ఏం పెట్టినా ఆడపిల్ల తరఫు వాళ్లే పెట్టాలి. ఏం తీసుకున్నా మగపిల్లవాడి తరఫు వాళ్లే తీసుకోవాలని అంటుంటావు కదమ్మా’’ నవ్వుతూ తల్లి మాటలు తల్లికే అప్పచెప్పాడు అలోకిత్‌.
వదిన దగ్గర నుంచి చిన్నోడిని తీసుకుంటూ ‘‘మధ్యలో అడ్డు తగులుతావేంరా అన్నయ్యా... అమ్మ చెబితే వినాలి అంతే’’ నవ్వుతూ అన్నాడు అన్విత్‌.
‘‘ఆటపట్టించడం చాలు. ఇకనుంచీ ఎంబ్రాయిడరీ వర్కులూ, వర్కర్ల పేమెంట్లూ అన్నీ చిన్న కోడలు చూసుకుంటుంది. నేను నా మనవడితో ఆడుకుంటాను. స్తోత్రా, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ నడిచేంతవరకూ నువ్వెక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఇక్కడ ఉండిపోవాల్సిందే’’ అంటూ ఇద్దరు కోడళ్ల వంకా చూసింది.
తలలూపారిద్దరూ.
‘‘ఇప్పటి నుండి నాకు నలుగురు పిల్లలు అని చెప్పుకుంటాను. కోడళ్లు కాదు, ఇకనుండి మీరిద్దరూ నా కూతుళ్లే’’ అని చెబుతుంటే... స్తోత్రతో పాటూ స్మరిత వంగి అత్తమామల పాదాలు తాకారు.
అన్విత్‌తో ఆడుకుంటున్న మనవడిని సురేఖ రెండు చేతులతో పైకెత్తుకుని ‘‘ఏరా, కన్నయ్యా నన్ను విడిచి నువ్వెక్కడికీ వెళ్లడం లేదు. సరేనా?’’ అనగానే వాడికి ఏమర్థమైందో నానమ్మ ముఖంలో ముఖం పెట్టి ముద్దులతో ముంచెత్తాడు.
అక్కడున్న వాళ్లందరిలో ఆనందంతో నవ్వులు వెల్లివిరిశాయి.

ఇదీ చదవండి: Bathukamma on Burj Khalifa: విశ్వవ్యాప్తమైన బతుకమ్మ పూలసంబురం.. బుర్జ్​ ఖలీఫాపై తెలంగాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.