Telangana Registrations Income : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే రూ. 10,000 కోట్లకు చేరింది. రెండుసార్లు మార్కెట్ విలువలు పెంచినా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలను సవరించినా లావాదేవీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది రెండోసారి పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 2 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల మొదటివారంలో రిజిస్ట్రేషన్లు కొంత మందగించినా తర్వాత పుంజుకున్నాయి.
అంచనా.. రూ.12,500 కోట్లు..
Telangana Registrations Income 2021-22 : ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి అంచనాలు రూ. 12,500 కోట్లు కాగా ఇప్పటికి వ్యవసాయ భూముల ద్వారా రూ. 1,300 కోట్లు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 8,700 కోట్లు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అంచనాలను అందుకోవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్లలో ఇదే అత్యధిక రాబడి. గతంలో గరిష్ఠంగా 2019-20లో రూ. 7,061 కోట్లు వచ్చింది.
Huge Income by Telangana Registrations :ఛార్జీల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి రెండో వారం నాటికి రూ.7,759 కోట్ల రాబడి వచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,151 కోట్లు రాగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ద్వారా రూ.6,608 కోట్లు వచ్చింది. ఇందులో గతనెల ఆదాయమే రూ.1,118 కోట్లు ఉంది.
రిజస్ట్రేషన్లకు ప్రాధాన్యం పెరిగి..
- పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ దూకుడు నేపథ్యంలో భూములు, స్థలాలు, ఇళ్ల క్రయ విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు భారీగా పెరుగుతున్నాయి.
- భూముల విలువ పెరగడం, వ్యవసాయ భూములకు డిమాండ్ భారీగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ గతంలోలా కాకుండా రిజిస్ట్రేషన్లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటం, రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ కార్యాలయాల్లో చేసుకునేలా సౌలభ్యం అందుబాటులోకి రావడం కూడా రిజిస్ట్రేషన్లు పెరిగేందుకు దోహదపడుతోంది.