ETV Bharat / city

ఉద్రిక్త తీర్థం.. నేతల పోటాపోటీ పర్యటనలతో క్షణక్షణం ఉత్కంఠ - Ramatirtha updates

ప్రశాంత రామతీర్థం క్షేత్రం... రాజకీయ రణరంగంలా మారింది. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ నిరసనలతో ఆ ప్రాంతమంతా నిప్పులు రాజుకున్నాయి. వైకాపా, తెలుగుదేశం, భాజపా శ్రేణుల ప్రదర్శనలు సహా.. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పర్యటనలు... అక్కడ మరింత ఉద్రిక్తతకు దారితీసింది. వీటికి తోడు.. విజయసాయిరెడ్డి కారుపై గుర్తుతెలియని వారు ఇటుక విసరటంతో.. పరిస్థితి సున్నితంగా మారింది.

ఉద్రిక్త తీర్థం.. నేతల పోటాపోటీ పర్యటనలతో క్షణక్షణం ఉత్కంఠ

author img

By

Published : Jan 3, 2021, 8:34 AM IST

ఉద్రిక్త తీర్థం.. నేతల పోటాపోటీ పర్యటనలతో క్షణక్షణం ఉత్కంఠ

ఏపీలోని విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెదేపా, భాజపా, వైకాపా నేతల పర్యటన నేపథ్యంలో మూడు పార్టీల శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. వారి పోటాపోటీ నినాదాలు.. మరోవైపు హిందూ సంఘాల జైశ్రీరామ్‌ స్మరణలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైకాపా నేత విజయసాయిరెడ్డి ఒకేసారి వస్తారన్న సమాచారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను భారీగా మోహరించారు. విజయనగరం పట్టణం నుంచి రామతీర్థం వరకు అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు.

బోడికొండపై ఉన్న పురాతన కోదండరాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని దుండగులు ఇటీవల తొలగించిన విషయం విదితమే. సమీపంలో ఉన్న కోనేటిలో రాముడి శిరస్సు లభించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని భాజపాతో పాటు రామభక్తులు కొండ వద్ద అప్పటి నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. ఇంతలో వైకాపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఇక్కడికి వస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. చంద్రబాబు కంటే ముందుగానే ఉదయం 11 గంటల సమయంలో విజయసాయిరెడ్డి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రానికి చేరుకున్నారు. అప్పటికే భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, భారీగా కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అడుగడుగునా అడ్డగింత

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలోని తెదేపా నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి రామతీర్థం చేరుకునే వరకు చంద్రబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డగించారు. నెల్లిమర్ల స్టేషన్‌ సమీపంలోనే చాలాసేపు వాహనశ్రేణి నిలిచిపోయింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వాహనం నుంచి కిందకు దిగి ఏం జరిగిందని పార్టీ నాయకులను అడగ్గా.. లారీలు, ఇతర వాహనాలు అడ్డం పెట్టారని బదులిచ్చారు. కాసేపటికి ట్రాఫిక్‌ తగ్గడంతో ముందుకు కదిలారు. వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డి అప్పటికే కొండ మీదకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఆయన వెంట వచ్చిన వాహనాలు ఒకవైపు, చంద్రబాబు వాహన శ్రేణి మరోవైపు నిలిచిపోయాయి. ఇరువర్గాలు ఘర్షణకు దిగకుండా పోలీసులు తెదేపా శ్రేణులను కొండ దగ్గరకు తీసుకెళ్లారు. నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు మధ్యాహ్నానికి చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. బోడికొండ మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి సుమారు 300 మెట్లున్న కొండ ఎక్కారు. రాముడి శిరస్సును పడేసిన కోనేరును పరిశీలించారు. ఆలయంలోకి వెళ్లి ధ్వంసమైన విగ్రహాన్ని చూడాలని ఆయన భావించినా ఈ ప్రాంతం పోలీసుల పర్యవేక్షణలో ఉందని అధికారులు చెప్పడంతో కాసేపు అక్కడే వేచి ఉన్నారు. గర్భగుడి తాళాలు వేసి ఉండటంతో బయటి నుంచే నమస్కరించి వెనుదిరిగారు. ఆయన వెంట తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, నేతలు అశోక్‌గజపతిరాజు, కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ జి.సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు కేఏనాయుడు, అనిత, మీసాల గీత పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

పోలీసుల తీరుపై భాజపా నిరసన

అంతకు ముందు వైకాపా నేత విజయసాయిరెడ్డి, ఆ పార్టీ శ్రేణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు బోడికొండపైకి వెళ్లారు. భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌, ఇతర నాయకులు కూడా కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా భాజపా నాయకులు అక్కడే బైఠాయించారు. విజయసాయిరెడ్డి కొండపైన సంఘటనా స్థలాన్ని పరిశీలించి కిందకు దిగి వస్తుండగా, ఆయన వాహన శ్రేణికి ఎదురుగా మాజీ మంత్రి కళా వెంకట్రావు, తెదేపా కార్యకర్తలు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తెదేపా, వైకాపా శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేస్తుండగా.. మరోవైపు భాజపా నాయకులు నిరసన స్వరం పెంచారు. విజయనగరం, గజపతినగరం ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, పార్టీ కార్యకర్తలు తెదేపా శ్రేణులను నెట్టుకుంటూ ముందుకెళ్లడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వాహనంపైకి కొంతమంది రాళ్లు, చెప్పులు, మంచినీటి పొట్లాలు విసిరారు. మూడు పార్టీల కార్యకర్తలూ పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేకపోయిన నేతలు పర్యటనకు ఎందుకొచ్చారని విపక్షాలతోపాటు, హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. వైకాపా, భాజపా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భాజపా విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని రెండుసార్లు సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. తనపై దాడిని నిరసిస్తూ విజయసాయిరెడ్డి అక్కడ నుంచి గొర్లెపేట వరకు పాదయాత్రగా వెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు రాజన్నదొర, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి చినప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్‌బాబు, వైకాపా నేత మజ్జి శ్రీనివాసరావు తదితరులున్నారు.

దాడిలో 20 మంది?
రామతీర్థంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో జిల్లా కేంద్రం నుంచే కాక విశాఖపట్నం నుంచి కూడా పోలీసులను రప్పించారు. విజయసాయిరెడ్డి వాహనంపై దాడిలో సుమారు 20 మంది వరకు ఉన్నారని, అందులో ఆలయ పరిసర ప్రాంతాలవారే ఎక్కువ మంది అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వారిని త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలిసింది.

మరో భద్రాద్రి.. రామతీర్థం

రామతీర్థంలో శ్రీరామచంద్రస్వామి దేవస్థానం మరో భద్రాద్రిగా విరాజిల్లుతోంది. దీని పక్కన ఉన్న నీలాచలం (బోడికొండ)పై కోదండరాముడు కొలువై ఉన్నాడు. 16వ శతాబ్దంలో కట్టిన ఈ దేవాలయాలకు ఘనమైన చరిత్ర ఉంది. ద్వాపర యుగంలో పాండవులు వనవాసం సందర్భంగా ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. శ్రీకృష్ణుడిని తమతో రావాలని కోరగా అందుకు తన పూర్వ అవతారంలోని సీతారామలక్ష్మణుల రూపాలను వారికి అందజేసి, తనకు బదులుగా విగ్రహాలను ఆరాధించుకోమని చెప్పినట్లు స్థలపురాణంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు కలలో శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి పాండవులకిచ్చిన విగ్రహాలు ఇక్కడ నీటి మడుగులో ఉన్నట్లు తెలిపారని చెబుతోంది. ఆ మేరకు బోడికొండపై కోనేరులో లభ్యమైన సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించారు. ఇక్కడ పలు ఉపాలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి ఉత్తరాన 2 కిలోమీటర్ల పొడవు, 600 మీటర్లు ఎత్తు గల ఏకశిలా పర్వతం నీలాచలంపై 16వ శతాబ్దం నాటి కోదండరాముని ఆలయం ఉంది. ఆ పక్కనే నీటి మడుగు ఉంది.

ఇదీ చదవండి: ‘పాదచారి.. వంతెన’ ఎక్కేదెప్పుడో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.