స్వతంత్ర కమిటీ వేయాలి..
దిశ హత్యతో ప్రజల్లో వెల్లువెత్తిన భావోద్వేగాలను అవకాశంగా తీసుకొని.. పోలీసులు నలుగురిని కాల్చి చంపినట్లు తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు జోక్యం చేసుకొని.. మృతదేహాలను భద్రపరిచేలా డీజీపీని ఆదేశించాలని కోరారు. దిల్లీ లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని ఫోరెన్సిక్ నిపుణులతో శవపరీక్ష నిర్వహించాలని అభ్యర్థించారు. ఎఫ్ఐఆర్, పోలీసుల ఫోన్ కాల్స్, వాహనాల కదలికలు, వైర్లెస్ రికార్డులు, జనరల్ డైరీ వివరాలను పరిశీలించేందుకు కోర్టు పర్యవేక్షణలో ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో విన్నవించారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలన్నారు.
మృతదేహాలు భద్రపరచండి
లేఖపై స్పందించిన హైకోర్టు... ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. రాత్రి 8 గంటలకు న్యాయమూర్తి నివాసంలో జరిగిన విచారణకు హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శవపరీక్ష ప్రక్రియనంతా వీడియో చిత్రీకరించినట్లు వివరించారు. ఆ వీడియోలను సీడీ లేదా పెన్‌డ్రైవ్‌లలో మహబూబ్ నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి సమర్పించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.
పోలీసులు ఇచ్చిన వీడియోలను శనివారం సాయంత్రానికల్లా తమకు చేర్చాలని మహబూబ్ నగర్ జిల్లా న్యాయమూర్తికి హైకోర్టు తెలిపింది. మృతదేహాలను ఈ నెల 9న.. రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 9న ఉదయం పదిన్నర గంటలకు చేపట్టనున్నట్లు పేర్కొంది.
ఇవీ చూడండి: ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు