కోత విధించిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల పింఛను ఒకే వాయిదాలో చెల్లించేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. వేతనాలు, పింఛనులో కోతపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కోత విధించిన వేతనాలు, ఫింఛన్ల చెల్లింపుపై త్వరలోనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఆర్డినెన్స్‌పై ఈనెల 28లోగా అసెంబ్లీ త్వరలో నిర్ణయం తీసుకోనుందని ఏజీ వివరించారు.
నిర్ణయం తీసుకుంటే వీలైనంత వెంటనే అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. పింఛనర్లకు చాలా కాలం వాయిదాలపై కాకుండా.. ఒకేసారి చెల్లించే అంశం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఎక్కువ వాయిదాల్లో చెల్లిస్తే పింఛనర్లు ఇబ్బంది పడతారని పేర్కొంది. అయితే తగ్గించిన వేతనం, పింఛనుకు 12 శాతం వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరారు. ప్రభుత్వం ముందయితే అసలు సొమ్ము చెల్లించనీయండని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నెల 28 వరకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణ అక్టోబరు 1కి వాయిదా వేసింది.