High Court On Amaravati Farmers: ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల మహాపాదయాత్రపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రంలోగా పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. లేదంటే శుక్రవారం ఉదయం మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
రాజధాని రైతులు ఈనెల 12 నుంచి అమరావతి నుంచి అరసవెల్లి వరకు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి కావాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. పోలీసులు అనుమతిపై ఇంకా ఏ విషయం తెలపలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది.
సీఆర్డీఏ సవరణలపై హైకోర్టును ఆశ్రయిస్తాం: సీఆర్డీఏ చట్టానికి వైకాపా ప్రభుత్వం చేసిన సవరణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు తేల్చిచెప్పారు. సీఆర్డీఏ చట్టానికి సవరణలు తీసుకొస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు, ఐకాస నాయకులు తప్పుపట్టారు. ముప్పు ప్రాంతం, శ్మశానం అన్న మంత్రులు ఈ భూముల్లో పేదలకు స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది న్యాయస్థానం తీర్పును ఉల్లఘించడమేనని తెలిపారు.
దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని రైతులు ఆరోపించారు. అభివృద్ధి చేయాల్సిందిపోయి.. వినాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో పేదలకు భూములిస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు. పేదల పేరుతో రాజధాని భూములు కాజేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రైతులు దుయ్యపట్టారు.
ఇవీ చదవండి: 'హిందూ పండగలకు ఆంక్షల పేరుతో సీఎం కేసీఆర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు'
అమిత్ షా టూర్లో కలకలం.. ఆంధ్రా ఎంపీ పీఏ అంటూ హల్చల్.. చివరకు...