Heavy rains in Telangana: రాష్ట్రంలో ఏడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు... జనజీవనం స్తంభించింది. అత్యవసరమై బయటకి వెళ్లేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో నాలుగో రోజు ముసురు కొనసాగుతోంది. చాంద్రాయణగుట్ట పరిధిలో వర్షానికి ఇంటిగోడ నాని కూలి మహిళపై పడింది. ఈ ప్రమాదంలో పర్వీన్ బేగం అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తుండడంతో... ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నగరంలోని మురికికాలువలు వరదనీటితో పొంగిపోతున్నాయి. మరోవైపు అల్పపీడనం మరింత బలపడే అవకాశముందన్న వాతావరణశాఖ.... ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
హనుమకొండ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మూడ్రోజులుగా ముసురుతో కూడిన వర్షం పడుతుండటంతో.... నగర ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. బాలసముద్రం ప్రాంతంలో వర్షాలకు చెట్లు కూలిపోయాయి. భూపాలపల్లి జిల్లాలోనూ భారీ వర్షాలకు వాగులు వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. మల్హర్ మండలం రుద్రారం చెరువు పొంగడంతో... 400 గొర్రెలు కొట్టుకోపోయాయని కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు.
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరిలో క్రమంగా వరద పెరుగుతుండడంతో... ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలోని 25 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భూపాలపల్లి జిల్లా వేములపల్లిలో డ్రైనేజీ నిర్మాణం లేకపోవడం వల్ల పలు ఇళ్లల్లోకి వరద వచ్చి చేరింది. రేగొండ మండలం గోరికొత్తపల్లిలో పెంకుటిల్లు వర్షానికి నాని కూలిపోయింది. మహబూబాబాద్ జిల్లా గుర్తూరు వద్ద ఆకేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. కంటయపాలెం చెరువు మత్తడి పోస్తుండడంతో.... కంటెయాపాలెం , గుర్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
నిజామాబాద్ శివారు పులాంగ్ వాగుకు ఆనుకుని ఉన్న నివాసాల్లోకి వరదనీరు చేరింది. దీంతో అక్కడున్న వారి కోసం పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్... వర్షాలు తగ్గుముఖం పట్టగానే... తిరిగి ఇళ్లల్లోకి పంపిస్తామని తెలిపారు. అప్పటివరకు అన్ని వసతులు కల్పిస్తామని... వారికి భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా జలల్‌పూర్ శివారు బడాఫహడ్ దర్గా వద్ద వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. మెట్లపై నుంచి భారీగా వరద నీరు పారుతోంది.
భారీ వర్షాల కారణంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అండర్ గ్రౌండ్ మైన్‌లోకి వెళ్లే కార్మికులు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గని నుంచి బయటకి వచ్చే రోడ్లు వరద నీటితో చిత్తడిగా మారాయి. గనిలోకి వెళ్లేమార్గంలోని వరద నీటిని... అధికారులు మోటార్ల ద్వారా బయటకి తీస్తున్నారు. మూడ్రోజుల్లో సుమారు 36 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి ఉపరితల గనుల్లోనూ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.
మరోవైపు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ, రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని లెక్కకట్టింది. ఎక్కువ ప్రాంతాల్లో 35 సెం.మీ. దాటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.
ఇవీ చూడండి: