పోలీస్, హోంగార్డులను నియమించాలని తాము ఎలా చెప్పగలమని, ప్రభుత్వానికి అటువంటి ఆదేశాలివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో పోలీస్, హోంగార్డుల నియామకాల నుంచి బోనస్, పరిహారం, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శనివారం కోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది రంగయ్య వాదనలు వినిపించారు. 40 వేల మంది పోలీసులు, 20 వేల మంది హోంగార్డులను నియమించకపోవడాన్ని సవాలు చేశామన్నారు. పోలీసులకు యాభై శాతం జీతాలు పెంచడంతో పాటు ప్రోత్సాహకంగా బోనస్ ప్రకటించాలన్నారు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలే ఆదేశించాలని కోరారు. కరోనా రక్షణ కిట్లు, శానిటైజర్లు, మాస్క్‌లు. రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయడం, ఈపీఎఫ్, ఆరోగ్య, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు.. భూమ్యాకాశాలపై అడగడానికి ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్‌ను అనుమతించలేమంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
ఇవీచూడండి: రాజకీయం- సాహిత్యం రెండు కళ్లలా 'పీవీ' జీవనం