Green tax for Vehicles : దేశంలో పెద్ద ఎత్తున కాలుష్యాన్ని వెదజల్లుతున్న కాలం చెల్లిన వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకువచ్చిన భారీ హరితపన్ను శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను వినియోగించేందుకు వీలుగా చెల్లించే ఈ పన్నును కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పెద్దఎత్తున పెంచిన సంగతి తెలిసిందే. వాణిజ్య వాహనాలకు 8 ఏళ్ల తరువాత ప్రతి ఏటా నిర్వహించే వాహన ఫిట్‌నెస్ పరీక్షల ఫీజులను సైతం భారీగా పెంచింది. భారీ పన్నుల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడతారనేది కేంద్రం భావన.
అయిదేళ్ల వరకూ ఇబ్బంది ఉండదు : రాష్ట్రంలో మొత్తం 1.45 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటిలో 15 సంవత్సరాలు దాటిన వాహనాలు సుమారు 32 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత వాహనాలు 24 లక్షలు, వాణిజ్య వాహనాలు ఏడు లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. మొత్తంమీద 1.75 నుంచి 1.95 లక్షల వాహనదారులు మాత్రమే హరిత పన్ను చెల్లించినట్లు రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
Green tax in Telangana : పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర సర్కార్ పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కాలం చెల్లిన వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకువచ్చిన హరితపన్ను ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. 15 ఏళ్లు దాటిన వాహనాలు వినియోగించేందుకు వీలుగా చెల్లించే ఈ పన్నును కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారీగా పెంచింది. కాలం చెల్లిన వాహనాల నుంచి తాజాగా పెంచిన పన్ను సక్రమంగా వసూలైతే రాష్ట్ర రవాణా శాఖకు భారీగా అదనపు ఆదాయం సమకూరనుంది.
Green tax Implements From Today : వ్యక్తిగత వాహనాలకు ఒక దఫా హరిత పన్ను చెలించి రిజిస్ట్రేషన్ పత్రాల్లో నమోదు చేసుకుంటే.. మళ్లీ అయిదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇక నుంచి వాహన తనిఖీల సందర్భంగా కాలుష్య పరీక్ష, వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన తనిఖీలను చేపట్టాలని యోచిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.