ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితకానుక ఇవ్వాలన్న సంకల్పం వందశాతం నెరవేరిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున తలపెట్టిన కోటి వృక్షార్చన అద్భుతంగా జరిగిందన్న ఆయన... పాల్గొన్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని తలపెట్టిన యజ్ఞం ఊహించిన దాని కన్నా విజయవంతం అయిందని... స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టినరోజున రుద్రాక్ష మొక్కనాటడం మరిచిపోలేని అనుభూతని అన్నారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న తెరాస శ్రేణులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంతోష్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
దేవుడి దయ, ముఖ్యమంత్రి ఆశీస్సులు, అందరి సహకారంతో కోటికి పైగా మొక్కలు నాటే యజ్ఞం పూర్తయిందని ఎంపీ సంతోష్ తెలిపారు. కోటి వృక్షార్చన విజయవంతంతో బాధ్యత మరింత పెరిగిందని, నాటిన ప్రతి మొక్కను వందశాతం బతికించాలని కోరారు. నాటిన మొక్కలను వందశాతం బతికిస్తేనే సార్థకత ఉంటుందని అన్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించిన సినీతారలు, నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలందరిలో హరిత భావజాల వ్యాప్తిలో భాగమయ్యారన్న ఎంపీ సంతోష్... హరిత తెలంగాణ సాధనలో వారి భాగస్వామ్యాన్ని నిరంతరం కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్