Raj bhavan Ugadi celebrations: హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వేదికగా ఉగాది ముందస్తు వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రజల మేలు కోసమే రాజ్‌భవన్ ఉందని, అందుకే వారి సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తుల విభాగం ఏర్పాటు చేశామని గవర్నర్ అన్నారు. దాని ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించానని చెప్పారు. మే నెల నుంచి ప్రజాదర్బార్ నడుస్తుందని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సరం తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని, ఈ ఏడాది ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజ్‌భవన్‌లో ఉగాది ఫ్లెక్సీలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా సీఎం కేసీఆర్ ఫొటోలు కనిపించలేదు. రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆహ్వానకార్డులు పంపినా వారంతా గైర్హాజరయ్యారు.
'నేను శక్తిమంతురాలిని తప్ప అహంభావిని కాదు. రాజ్‌భవన్‌లో ఉగాది ఉత్సవాలకు అందరినీ ఆహ్వానించాను. ప్రభుత్వంలో అత్యున్నతస్థాయి వ్యక్తి నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరినీ ఎలాంటి భేదభావం లేకుండా పిలిచాం. రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించాం. ఉత్సవాలకు రానివారి గురించి బాధలేదు.'
- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్ పక్కన పెట్టడంతో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలు తలెత్తాయి. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ వేళ రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరదూరంగానే ఉన్నారు. తన ప్రసంగం లేకుండానే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగడంపై గవర్నర్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు. యాదాద్రి ఉద్ఘాటన ఉత్సవానికీ గవర్నర్‌ను ఆహ్వానించలేదు. ఉగాది ముందస్తు వేడుకలకు ముఖ్యమంత్రి వస్తారని ఆశించినా అది జరగలేదు. ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి ఉంటే తప్పకుండా వెళ్లేదాన్నని గవర్నర్ తెలిపారు.
'ప్రగతిభవన్‌లో ఉగాది ఉత్సవాలకు నాకు ఆహ్వానం అందలేదు. ఒకవేళ వేడుకలకు పిలిస్తే... గౌరవంగా భావించి తప్పకుండా వెళతాను. ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ హాజరయ్యేదాన్ని.'
- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
యాదాద్రికి పునఃప్రారంభానికి తనను ఆహ్వానించలేదని చెప్పిన గవర్నర్.. ప్రభుత్వపరంగా కొన్ని అంశాల్లో విభేదాలున్నాయని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేసే వ్యక్తిని కానని తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.
'గవర్నర్ హోదాలో కాకుండా సాధారణ పౌరురాలిగా మేడారం జాతరకు వెళ్లాను. ప్రోటోకాల్ నిబంధనలు అధికారులు పాటించాలి. గవర్నర్‌గా ఎవరున్నా...యంత్రాంగం రూల్స్ పాటించాల్సిందే. నాకు స్వాగతం పలికేందుకు ఉన్నతాధికారులెవరూ రాలేదనే అంశంపై నాకేమీ బాధగాలేదు. ప్రగతిభవన్....రాజ్‌భవన్‌కు మధ్య ఎలాంటి దూరం లేదనిపిస్తున్నప్పటికీ.... మా నుంచి వెళ్లే ఆహ్వానాలను పదేపదే ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం వల్ల కొంత ఎడం ఉందనిపిస్తోంది.'
- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
వరుస పరిణామాలు చూస్తుంటే ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ల మధ్య దూరం మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైల మధ్య మొదట్లో విభేదాలు లేనప్పటికీ...తదనంతరం ఎడం పెరుగుతూ వస్తోంది.
ఇదీ చూడండి: