కరోనాకు సంబంధించి 13 ప్రభుత్వ, 18 ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఆర్‌టీ - పీపీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్నామని, వీటిని మొబైల్ వాహనాల ద్వారా నిర్వహించడం సాధ్యం కాదని... హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పేర్కొంది. వైద్యుల రక్షణ ఏర్పాట్లు, సూర్యాపేటతో సహా పలు ప్రాంతాల్లో తగినన్ని పరీక్షలు నిర్వహించలేదంటూ దాఖలైన పిటిషన్‌లలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. జూన్ 29 వరకు 84,134 పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది. జూన్ 20 నుంచి 29 వరకు 40,837 పరీక్షలు చేపట్టామని పేర్కొంది.
665 నియామకాలు చేపట్టాం
ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్ ఉన్న కాంటాక్ట్‌కు సంబంధించి 5, 10 రోజుల మధ్య ర్యాపిడ్ యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రులుగా జీహెచ్‌ఎంసీలో 9, ఇతర జిల్లాల్లో 52 ఆసుపత్రులను గుర్తించినట్లు పేర్కొంది. వీటితో పాటు ప్రభుత్వం వెల్లడించిన మీడియా నివేదికలను హైకోర్టుకు సమర్పించింది. గాంధీ ఆసుపత్రిలో పడకల సంఖ్యను మొదట 1,012 నుంచి 1,890కి పెంచినట్టు దీన్ని 2,100 పడకలకు పెంచుతున్నట్టు తెలిపింది. 665 మంది సిబ్బంది నియామకాలు చేపట్టామని ఇవి తుది దశలో ఉన్నాయని వెల్లడించింది.
తగిన ఏర్పాట్లు చేశాం
గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందితో పాటు పోలీసులకు కరోనా నుంచి రక్షణ కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. కోవిడ్ చికిత్సల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు సూచనలు చేసినట్లు తెలిపింది. థర్మల్ స్క్రీనింగ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు 2,157 థర్మామీటర్లు పంపామని, మరో ఎనిమిది వేలు కొనుగోలు చేయనున్నట్లు వివరించింది.