AP Govt Hiked Water Price : ఏపీలో పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చే నీటి ధర మరింత భారం కాబోతోంది. ఇంతవరకూ పరిశ్రమలకు నీటి సరఫరాకు ఒక సమగ్ర, సారూప్య పద్ధతి లేదన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ధరలు పెంచుతూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ వివిధ శాఖల పరిధిలో నీటి సరఫరాకు సంబంధించి వేర్వేరు విధానాలు అవలంబిస్తున్నారు. ఇక నుంచి ఏ పరిశ్రమ వారైనా కిలో లీటరుకు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
AP Govt Hiked Water Price for Industries : ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందడం వల్ల పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం పెరుగుతుంది. ఈ కారణంగా తాగునీటికి కొరత ఏర్పడవచ్చు. ఉపరితల, భూగర్భజలాలను సుస్థిర అభివృద్ధికి తగిన విధంగా మాత్రమే ఉపయోగించుకునే వ్యూహాలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. పరిశ్రమలకు నీటి ధరలు నిర్ణయించే విషయంలో ఒకే విధంగా ఉండే సూత్రం ఏదీ పాటించడం లేదని రెవెన్యూ మొబిలైజ్ కమిటీ ఒక సమావేశంలో అభిప్రాయపడింది. వివిధ ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి ఈ విషయంలో ఒకే విధానం రూపొందించాలని కోరిన మీదట జలవనరులశాఖ తాజాగా సిఫార్సులు చేసింది.
- పరిశ్రమలకు సరఫరా చేసే కిలో లీటరు (1,000లీటర్లకు) నీటికి రూ.120 చెల్లించాలని జలవనరులశాఖ సిఫార్సు చేసింది. ఈ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని జలవనరులశాఖ, పరిశ్రమల శాఖలు చెరిసగం పంచుకోవాలి. ఈ ధర పెంపు ప్రభావం ఎలా ఉంటుందో మదింపు చేయాలని పరిశ్రమల శాఖను జలవనరులశాఖ కోరింది. జలవనరుల శాఖ నేరుగా 143 ప్రైవేటు పరిశ్రమలకు నీటిని సరఫరా చేస్తోంది.
- వివిధ రాష్ట్రాల్లో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి టారిఫ్‌లు పరిశీలించిన తరవాత కిలోలీటరుకు 120 ధర వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- కొత్త ధరలకు అనుగుణంగా జలవనరులశాఖ ఇప్పటికే నీటిని సరఫరా చేస్తున్న 143 పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి తాజా ఒప్పందాలు కుదుర్చుకోవాలని, అలాగే పరిశ్రమలశాఖ, మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధిశాఖ సైతం ఆయా సంస్థలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- కొత్త ధరలతో తక్షణమే పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుని అమలు చేయాలని ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అన్ని చోట్లా ఈ మేరకు కసరత్తు ప్రారంభమైంది.
కర్నూలు జిల్లాలో గతంలో పాత టారిఫ్ వల్ల కేవలం రూ.68 లక్షల మేర చెల్లించే పరిశ్రమలు.. తాజా టారిఫ్‌తో రూ.147 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోందని అధికారికవర్గాల సమాచారం. అక్కడ ప్రసుత్తం కిలోలీటరు ధర 38పైసలే ఉందని చెబుతున్నారు.