ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 నుంచి 2030 కాలానికి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధాన ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక విడుదల చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. రాష్ట్రంలోనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రాయితీలు ఇవ్వనున్నారు. తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రహదారి పన్ను మినహాయింపుతో పాటు రిజిస్ట్రేషన్ రుసుము సైతం మినహాయిస్తారు. మొదటి 20 వేల మూడు చక్రాల ఆటోలకు సైతం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు దొరకనుంది.
మొదటి 5 వేల 4 చక్రాల వాహనాలు, మొదటి 10 వేల లైట్ గూడ్స్ వాహనాలు, మొదటి 5 వేల ఎలక్ట్రిక్ కార్లతో పాటు తొలి 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు లభించనుంది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. ప్రజా రవాణా వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాల కోసం అవసరమైన చర్యలు చేపట్టనుంది.
ఇదీ చూడండి: 'ధరణి'లో స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం