Glass floor in Vinayaka Mandapam: ఏపీలోని నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్‌లోనూ పోటీ పడి విభిన్నంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకువచ్చి మరీ.. సినిమా సెట్టింగ్‌లు ఏర్పాటు చేసి గణనాధుడికి పూజలు చేస్తున్నారు. కొబ్బరి చిప్పలతో వినాయకుడు, పర్యావరణహితంగా భారీ మట్టి వినాయకుడు, ధాన్యంతో వినాయకుడు వంటి రూపాల్లో తయారు చేశారు. వీటిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
బాలాజీ నగర్ రైస్ మిల్లు సెంటర్లో 12ఏళ్లుగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల సెట్టింగ్‌లో వెంకటేశ్వరుని రూపంలో వినాయకుడు, అనంతపద్మస్వామి ఆలయం సెట్టింగ్‌లో లంబోదరుడిని ఏర్పాటు చేశారు. ఈసారి పూర్తిగా గాజుతో సెట్టింగ్ వేశారు. అందులో ఏడుగుర్రాల రథంపై గణనాధుడిని ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఎంతో అందంగా తయారు చేసిన సప్తవర్ణాల వినాయకుడిని చూడటానికి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శ్రావణ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సెట్టింగ్ రూపొందించారు. భక్తులు నడిచే ప్రాంతాల్లో కూడా అద్దాలను ఏర్పాటు చేశారు. వంద మంది భక్తులు ఒకేసారి నడిచినా అద్దాలు పగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ కాంతుల మధ్య గాజు వినాయకుడి ఆలయం మెరిసిపోతోంది. గాజుగ్లాసుల మధ్య వివిధ రకాలైన పూలను అమర్చడం మరింత అందానిస్తోంది. విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్న గణనాధుడిని చూడడానికి పిల్లలు, మహిళలు భారీగా తరలివస్తున్నారు.
ఇవీ చదవండి: