అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాలికల్లో ఆత్మస్థైర్యం నింపి, ఉన్నత లక్ష్యాలవైపు నడిచేలా ‘బాలికే భవిష్యత్తు’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. బాలికలకు ఒక్కరోజు అధికారులుగా విధులు నిర్వహించే అవకాశం కల్పించారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 527 మంది బాలికలు ఒక్కరోజు అధికారులుగా బాధ్యతలు చేపట్టారు. గార్లదిన్నె కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న శ్రావణి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఈమె తల్లిదండ్రులు రత్నమ్మ, పాములేటి వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలు- పరిష్కారాలపై శ్రావణి కలెక్టర్ హోదాలో మాట్లాడింది.
ఓ బాధితురాలికి రూ.25వేలు నష్టపరిహారం అందించే ఫైల్లో సంతకం పెట్టింది. మహిళా ఉద్యోగులు ఇంటి బాధ్యతలూ చూసుకుంటారు కాబట్టి రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఎనిమిది వరకూ వారికి ఎలాంటి విధులూ అప్పగించకూడదంటూ మరో దస్త్రంమీద సంతకం చేసింది. ఇలా జిల్లా ఉన్నతాధికారిగా విధులు నిర్వహించటం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంటోంది శ్రావణి.