ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Ganesh) అంటేనే జనం తాకిడి విపరీతంగా ఉంటుంది.. వేకువ జాము మొదలు అర్ధరాత్రి దాటినా మండపం తెర మూయనివ్వకుండా భక్తుల రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. వారాంతపు రోజుల్లో ఈ పరిస్థితి మరింతగా అదుపు చేయలేని స్థితిలో ఉంటుంది. ప్రతి సారి గణపతి చెంతకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగేలా మార్పులు, చేర్పులపై సమీక్షిస్తుంటారు. ఈ పర్యాయం మరో అడుగు ముందుకేసి.. మరింత సులువుగా ముందుకెళ్లే మార్గాలు అవసరమని, అది ఎలాగైతే సాధ్యమని అధికారులు సమాలోచన చేస్తున్నారు.
ఇప్పటికే పోలీసు అధికారులు, ఖైరతాబాద్ గణేష్(Khairatabad Ganesh) ఉత్సవ కమిటీ భక్తుల మార్గాలు, వీఐపీల మార్గం, అత్యవసర మార్గం తదితరాలపై నమూనా చిత్రం వేశారు. రూపొందించిన నమూనా ప్రకారం ఎంత మేరకు సాధ్యమవుతుందనే కోణంలో పరిశీలనకు శుక్రవారం మధ్య మండలం అదనపు డీసీపీ రమణారెడ్డి, సైఫాబాద్ ఏసీపీ నర్సింగరావు, ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి తదితరులు మహా గణపతి చెంతకు చేరుకున్నారు. అదనపు డీసీపీకి రూట్ మ్యాప్ మొత్తం తొలుత నమూనా చిత్రంపై వివరించారు. తర్వాత ఆయన ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి భక్తులు వచ్చీపోయే మార్గాలను పరిశీలించారు.
గతంలో మాదిరి కాకుండా కొద్ది మార్పులతో బారికేడ్లు ఏర్పాటుచేస్తే బాగన్న ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే త్వరలో మహా గణపతి చెంత సేవలు అందించే రోడ్లు భవనాలు, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాంతి భద్రతలు, ట్రాఫిక్, విద్యుత్తు, తదితర శాఖలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా అదనపు డీసీపీ రమణారెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై పరిశీలించినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయ సమావేశం తర్వాత వీటిపై నిర్ణయించనున్నట్లు వివరించారు. అధికారులతో పాటు ఉత్సవ కమిటీ ప్రతినిధులు సందీప్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తుది దశకు నిర్మాణం.. నేత్రోత్సవం నేడు
వినాయక చవితిని ఉత్సవాలను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో సిద్ధమవుతున్న ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Ganesh) నిర్మాణం దాదాపు చివరి దశలో ఉంది. రంగులు సైతం దాదాపు పూర్తి చేసుకున్న వినాయకుడికి శనివారం ఉదయం 11:30 గంటలకు నేత్రోత్సవ కార్యక్రమం జరుగనుందని ఉత్సవ కమిటీ తెలిపింది. కళ్లను పూర్తిగా దిద్దడం ద్వారా కంటి చూపు ఏర్పాటుచేసే పెయింటింగ్ పనులు శిల్పి రాజేంద్రన్ పూర్తి చేయనున్నారు.
ఈ ఏడాది 40 అడుగులతో పంచముఖ రుద్ర గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. గతేడాది కొవిడ్ వ్యాప్తి ప్రభావం గణేష్ నవరాత్రులపైనా పడింది. గణనాథుడిని ఏర్పాటు చేయాలా వద్దా అనే సందిగ్దంలో చివరకు 9 అడుగుల విగ్రహాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేసేలా మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. నవరాత్రులు కూడా నిడారంబరంగానే జరిగాయి.
కరోనా కేసులు తగ్గడం వల్ల ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. 40 అడుగుల విగ్రహం పనులు దాదాపు పూర్తయ్యాయి. కళాకారులు విగ్రహానికి రంగులు వేస్తున్నారు. తలపై ఆది శేషులు, ఐదు తలలు, ఐదు చేతుల రూపంతో గణనాథుడు భక్తుల కోర్కెలు తీర్చనున్నాడు. మహా గణపతికి ఎడమవైపున కృష్ణ కాళీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కుడివైపున కాల నాగేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.