హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లోని బాకారంలో కలుషిత నీటి సమస్యతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. ఏడాది నుంచి తమ సమస్యను మొరపెట్టుకున్నా.. జల మండలి, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్ బిల్డర్.. డ్రైనేజీ కనెక్షన్ను తమ ప్రాంతంలో కలపడం వల్ల నీరు కలుషితమవుతోందని వాపోయారు.
కలుషిత నీటి సమస్య పరిష్కారం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడం లేదని మహిళలు ఆరోపించారు. స్థానికుల నిరసన విషయం తెలుసుకున్న జలమండలి అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా.. మహిళలు వెనక్కి తగ్గలేదు. ఇన్ని రోజులు ఏం చేశారని నిలదీశారు.