రాష్ట్రంలో పగటిపూట లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో నేటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. సాధారణ పనిదినాల్లో మాదిరిగానే రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకులు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల సేవలు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో గత నెల 12 నుంచి లాక్‌డౌన్ ప్రారంభం కాగా ప్రభుత్వం అన్ని కార్యాలయాల పనివేళలను కుదించింది. లాక్‌డౌన్ మినహాయింపు సమయాన్ని తాజాగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచడంతో రోజువారీ లావాదేవీలు యథాతథంగా కొనసాగనున్నాయి. సచివాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. రైతుబంధు పథకం సాయం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం లోపు పాస్‌పుస్తకాలతో పాటు ఇతర వివరాలను వ్యవసాయ అధికారులకు ఇస్తేనే రైతుబంధు పథకంలో లబ్ధిదారులుగా చేరుతారు. ఈ ఏడాది తొలిదఫా పీఎం కిసాన్ నిధులు కొందరు రైతులకు జమకాలేదు. కార్యాలయాలు పూర్తిగా పనిచేయనుండడంతో రైతులు అధికారులను కలిసి పేర్ల నమోదు, సమస్యల పరిష్కారం చేసుకునేందుకు వీలు కలగనుంది.
ప్రజారవాణా సాయంత్రం 6 గంటల వరకే
లాక్‌డౌన్ మినహాయింపు సమయం పొడిగించడంతో ఆ మేరకు ప్రజారవాణా సేవలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 6 గంటలకు తొలి ట్రిప్పు మొదలై, సాయంత్రం 6 గంటలకు చివరి ట్రిప్పు ముగిసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు సాయంత్రం 6 గంటల్లోగా అక్కడికి చేరుకుంటాయి. హైదరాబాద్‌లో మెట్రోరైలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తుందని ఆ సంస్థ ప్రకటించింది.
* రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది అందరూ గురువారం నుంచి విధులకు హాజరుకావాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశాలు జారీ చేశారు.
విశ్వవిద్యాలయాలు గురువారం నుంచి వంద శాతం సామర్థ్యంతో పనిచేయనున్నాయి. ఇప్పటివరకూ 33 శాతం ఉద్యోగులతో నడుస్తుండగా, ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరు కానున్నారు.
పెరగనున్న రిజిస్ట్రేషన్లు
లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో గత నెల 12 నుంచి మూడువారాల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. సమయం, సిబ్బంది తక్కువగా ఉండటంతో అవి అంతంతమాత్రంగా సాగాయి. జూన్ నెలలో రిజిస్ట్రేషన్ల కోసం 31,922 దరఖాస్తులు పోర్టల్‌లో వస్తే.. ఇందులో 23,895 దరఖాస్తులకు చలాన్లు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్లు కేవలం 15 వేలు మాత్రమే జరిగాయి. పనిగంటల పెంపుతో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని కార్యాలయాల్లో కరోనా నిబంధనలు విధిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.