గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి కోసం కృషి చేస్తున్న గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్, టెక్నాలజీ - జీకాట్ సంస్థలను సేవలను మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రశంసించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, గ్రామాలు స్వయం సమృద్ధి స్థాపన లక్ష్యంగా కృషి చేస్తున్న 150 మంది నిష్ణాతులను సత్కరించడం అభినందనీయమన్నారు. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ - జీకాట్ ఆధ్వర్యంలో అందించిన గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలను ప్రశంసిస్తూ ఆయన ఓ సందేశం పంపారు.
గ్రామాల్లో వ్యవస్థలు, మౌలిక సదుపాయాలతో గ్రామీణులంతా గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఉండాలంటే ప్రతి ఊరు స్వయం సమృద్ధి సాధించాలని మహాత్మాగాంధీ గ్రామస్వరాజ్య సూత్రం ప్రతిపాదించారని మన్మోహన్ సింగ్ అన్నారు. గాంధీజీ ఎప్పుడూ స్వీయ క్రమశిక్షణ గురించి చెప్పేవారని... ఇది మనుషులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాల్లో ఒకటన్నారని మాజీ ప్రధాని తెలిపారు. జీవితం ప్రశాంతంగా... విజయవంతంగా సాగాలంటే స్వీయ క్రమశిక్షణ చాలా ముఖ్యమని చెప్పారు.
ఈ సందర్భంగా జీకాట్‌కు తన శుభాభినందనలను తెలిపారు. మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల ఆద్యుడైన డాక్టర్ మన్మోహన్ సింగ్ నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందడం ఎంతో సంతోషదాయకమని జీకాట్ బృందం హర్షం వ్యక్తం చేసింది. స్వయంగా మాజీ ప్రధాని నుంచి లేఖ వచ్చిన విషయాన్ని జీకాట్ ప్రధాన సలహాదారు శ్యాంమోహన్, ఛైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రాంరెడ్డి, వ్యవస్థాపకుడు దిల్లీ వసంత్ సంతోషం వ్యక్తం చేశారు.