AP Floods massive damage: గోదావరి వరద అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఏపీలోని పోలవరం ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పోటెత్తుతున్న వరదనీరు ఇళ్లను ముంచేసింది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా కుక్కునూరులో రైస్‌మిల్ కాలనీ వాసుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. తమ కాలనీ ముంపు పరిధిలోకి రాదని, వరద నీరు దరిచేరదని అధికారులు చెప్పినా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వాపోయారు. మూటాముల్లె సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. సుమారు రెండున్నర కిలోమీటర్లు పడవపై ప్రయాణం చేస్తేనే గ్రామంలోకి చేరుకోలేని దుస్థితి నెలకొంది. మరోవైపు పోలవరం ముంపు గ్రామాల్లో అధికారులు సహాయ చర్యలు చేపట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దాతలు ఆహార పంపిణీ చేస్తున్నారు.అశ్వారావుపేట వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థాన కమిటీ వరద ప్రాంతాల్లో వెయ్యి మందికి భోజనం పంపిణీ చేసింది.
ధవళేశ్వరం నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదలతో కోనసీమ జిల్లాలో లంకలు విలవిల్లాడుతున్నాయి. ఏటిగట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలను వరద ముంచెత్తుతోంది. పి.గన్నవరం వద్ద రెండు అక్విడెక్టుల మీదుగా వరద ప్రవహిస్తుండగా ప్రధాన పంట కాల్వల్లోకి నీరు చేరుతోంది. గంటపెదపూడి నుంచి రాజోలు వరకు రహదారులపై నీరు పొంగిపొర్లుతోంది.అన్నపల్లి, రాజోలు, దిండి, నాగుల్లంక, మెర్లపాలెం ప్రాంతాల్లో ఏటిగట్లు బలహీనపడటంతో ఇసుక బస్తాలు వేసి రక్షణ చర్యలు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో కాలువలు, డ్రెయిన్లు పొంగి రోడ్లు, నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. నరసాపురంలో పంట కాలువ పోటెత్తి జాతీయ రహదారిపై నీరు చేరింది. అల్లూరి జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గెడ్డలు జోరుమీదున్నాయి.జామిగుడ, గుంజివాడ గ్రామాల మధ్య వంతెన లేకపోవడంతో ప్రజలు ఒంటికి డిప్పలు కట్టుకుని వాగుల్లో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు.
గోదావరి వరదలు రైతులను నిండా ముంచేశాయి. ఉద్యాన పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన అరటి, బొప్పాయి, కంద, మొక్కజొన్న, కూరగాయ పంటల్ని వరద సర్వనాశనం చేసింది. వారం, పది రోజులు ఆగితే పంట చేతికొచ్చే దశలో వరద ముంచెత్తి తమ ఆశల్ని చిదిమేసిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో కాస్తో కూస్తో పంటయినా దక్కించుకుందామని.. పడవలపై ప్రమాదానికి ఎదురెళుతున్నారు. పక్వానికి రాని అరటి, పూర్తిగా గింజ కట్టని మొక్కజొన్న, చిన్న చిన్న బొప్పాయిని కోయించి ఒడ్డుకు చేరుస్తున్నారు. మార్కెట్లో వాటికి కనీస ధర కూడా దక్కడం లేదు.గోదావరికి మళ్లీ వరదలు వస్తే ఇక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: