ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఆ వెంటనే చేపట్టిన ఓట్ల లెక్కింపు- ఫలితాల వెల్లడి సమయంలో... చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం శింగవరంలో 25 ఓట్ల తేడాతో సుభాషిణి అనే మహిళ ఓడిపోయారు. రీకౌంటింగ్ చేప్టటాలంటూ లెక్కింపు కేంద్రం వద్ద మద్దతుదారులతో కలిసి ఆమె బైఠాయించారు. బ్యాలెట్ బాక్స్‌లు తరలించేందుకు అధికారులు యత్నించగా అడ్డగించారు. బూరుగయ్య అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
నంద్యాల మండలం బిళ్ళలాపురంలో చిలకల లక్ష్మిదేవి 56 ఓట్లతో గెలుపొందినట్లు తొలుత చెప్పిన అధికారులు..తర్వాత రమణమ్మ విజయం సాధించినట్లు ప్రకటించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లక్ష్మిదేవి వర్గీయులు..రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సిబ్బంది బయటకు వెళ్లకుండా ఆందోళన చేశారు.
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పడమట గోగులపల్లిలో రీపోలింగ్..రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం సూదివారిపాలెంలో కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు అందోళన చేశారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కే.పీ.పాలెం సౌత్‌లో విజయలక్ష్మి 7 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థులు రెండుసార్లు రీకౌంటింగ్ కోరగా...మళ్లీ అదే ఫలితం వచ్చింది. కానీ డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదంటూ విజయలక్ష్మి మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం ముందు పెద్దఎత్తున ధర్నా చేశారు. కాళ్ల మండలం కాళ్ళకూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. బొర్రా విజయకుమారి 30 ఓట్ల తేడాతో గెలిచినట్లు తొలుత ప్రకటించిన అధికారులు.. కాసేపటకే 5 ఓట్ల తేడాతో సాదు శ్రీదేవి విజయం సాధించినట్లు చెప్పారు. ఈ ప్రకటనను నిరసిస్తూ విజయకుమారి వర్గీయులు ఆందోళనకు దిగడంతో..విజయవాడ - భీమవరం రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు.
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలో అడబాల ఆంజనేయులు అనే అభ్యర్థి 7 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేడిబోయిన శ్రీను అనే అభ్యర్థి రీకౌంటింగ్ కోసం పట్టుబట్టగా..అధికారులు నిరాకరించారు. ఆగ్రహించిన శ్రీను మద్దతుదారులు.. కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. పిఠాపురం మండలం కందరాడ ఎన్నికల లెక్కింపు కేందంలోకి కొందరు చొరబడి బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లారు. సుశీల అనే అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండగా..కొందరు లెక్కింపు కేంద్రంలోకి చొరబడి ఈ పనికి పాల్పడ్డారు. ఈ పరిణామంతో సుశీల మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఓడిపోతామనే భయంతో ప్రత్యర్థులు బ్యాలెట్లు ఎత్తుకెళ్లారని ఆరోపించారు.