రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 వర్సిటీల్లో బోధనాసిబ్బంది భర్తీని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా చేపట్టాలని సీఎస్ సోమేశ్‌కుమార్ భావిస్తున్నారు. అందుకు సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డితో పాటు వర్సిటీల రిజిస్ట్రార్లతో చర్చించారు. ముఖాముఖీలకు ముందు స్క్రీనింగ్ టెస్టు జరపాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. పరీక్ష జరిపితే ప్రక్రియ సులభమవుతుందని చిత్రా రామచంద్రన్ అభిప్రాయపడినట్లు సమాచారం.
దాదాపు ఏడాదిన్నర కిందట ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లోని వర్సిటీల్లో నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక అందజేసేందుకు ఏడుగురితో ఓ కమిటీని నియమించింది. ఇటీవల మారిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆ కమిటీ బుధవారం మరోసారి సమావేశమై మార్పులు చేర్పులతో కూడిన నివేదికను అందజేస్తుంది. అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు లింబాద్రి, వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, ఓయూ మాజీ ఉపకులపతి తిరుపతిరావు, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ గోవర్ధన్ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే నియామకాలు జరపాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘాల నేతలు చిత్రా రామచంద్రన్‌కు వినతిపత్రాలు అందజేశారు.