ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల వేతనాలపై యాజమాన్యాలు కొత్త పోకడలు పోతున్నాయి. పూర్తి వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తూ... అందులో సగం తిరిగి ఇచ్చేయాలని ఆదేశిస్తున్నాయి. తిరిగి ఇవ్వకుంటే సిబ్బందితో ఫోన్లు చేయిస్తున్నాయి. రాష్ట్రంలో 180 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా అందులో 50కి పైగా కళాశాలలు ప్రతినెల వేతనాలు ఇవ్వడం లేదు. మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చేవీ ఉన్నాయి.
కొత్త ఎత్తుగడ
కరోనా కారణంగా మార్చి 16వ తేదీ నుంచి విద్యాసంస్థలు మూతపడటంతో అప్పటి నుంచి పలు కళాశాలలు అధ్యాపకులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో అధ్యాపక సంఘాలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), జేఎన్‌టీయూహెచ్‌తోపాటు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశాయి. దాదాపు 80 కళాశాలలు ఇవ్వడం లేదని తెలిపాయి. జేఎన్‌టీయూహెచ్ ఆయా కళాశాలలను వివరణ కోరింది. ఈక్రమంలో పూర్తి వేతనం ఇస్తున్నామని చూపించుకునేందుకు బ్యాంకులో వేస్తూ...తర్వాత అందులో సగం తీసుకుంటున్నాయి.
తిరిగి ఇవ్వాలని అధ్యాపకులను గద్దిస్తున్న సిబ్బంది
హైదరాబాద్ శివారులోని ఓ కళాశాల సిబ్బంది గత నెలలో ఇచ్చిన వేతనంలో సగం ఇవ్వలేదని, వెంటనే పంపించాలని అధ్యాపకులకు ఫోన్లు చేసి ఆదేశించడం గమనార్హం. ఎందుకు ఫోన్లు తీయడం లేదని గద్దించారు. హైదరాబాద్‌లోని మరో కళాశాల మహిళా ఉద్యోగి నుంచి కూడా ఓ అధ్యాపకుడికి ఈ ప్రశ్నే ఎదురైంది. అలా అడుగుతున్న వాయిస్ రికార్డులను తాజాగా అధ్యాపక సంఘాలు సేకరించాయి. జేఎన్‌టీయూహెచ్‌కు అందజేయనున్నాయి. పలు కళాశాలలున్న ఓ గ్రూపు విద్యా సంస్థ ఏకంగా ఏటీఎం కేంద్రాల వద్దే కాపు కాసింది. వారితో అక్కడ డ్రా చేయించి వెనక్కి తీసుకుంటోంది. జేఎన్‌టీయూహెచ్ మెతక వైఖరితో యాజమాన్యాల ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!