ప్రపంచంలోనే గొప్ప స్థితిలో రైల్వే వ్యవస్థ ఉండటానికి కార్మికులు, ఉద్యోగుల కృషియే కారణమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో కార్యక్రమాల్లో అన్నింటా స్నేహభావంతో మెలిగామని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రైల్వే వాగన్ కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో నిర్మిస్తామన్న కేంద్రం.. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. బుల్లెట్ ట్రైన్లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తే ఉద్యమాలకు సిద్ధమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణాదికి కేంద్రం న్యాయం చేయాలని, నూతన ప్రాజెక్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
హైస్పీడ్ కనెక్టివిటీ వల్లే అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని కేటీఆర్ అన్నారు. భారత్‌లోనూ హైస్పీడ్ కనెక్టివిటీ తీసుకురావాలని కేంద్రానికి సూచించారు.
- ఇదీ చూడండి : కుల వృత్తులకు వెయ్యి కోట్లతో చేయూత: మంత్రి తలసాని