Electricity Usage in Telangana : తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం 12:28 గంటలకు రికార్డు స్థాయిలో 14,160 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని ఆ శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్తు డిమాండ్ నమోదు కావడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.
సోమవారం సాయంత్రం 3:54 గంటలకు 13,857 మెగావాట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. మరో నాలుగైదు రోజుల వరకు విద్యుత్తు వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 18,000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ట్రాన్స్ కో-జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. వినియోగం ఎంత పెరిగినా వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్తును రూ.20 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే విద్యుత్తును కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
- ఇదీ చదవండి : పన్ను ఆదాయంలో అంచనాలకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం