రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా కరోనా సోకలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కేవలం బయట ప్రాంతాల్లో సోకి హైదరాబాద్కు వచ్చిన వారిలో మాత్రమే వ్యాధి లక్షణాలు గుర్తించామన్నారు. ఇవాళ 47 మందికి గాంధీ ఆసుపత్రిలో స్క్రీనింగ్ చేశామన్నారు. వారిలో 45 మందికి నెగటివ్ వచ్చిందని పేర్కొన్నారు. స్పష్టత కోసం ఇద్దరి రిపోర్టులను పుణెకు పంపించినట్లు ఈటల వెల్లడించారు.
ప్రజలు వదంతులు, అవాస్తవాలు నమ్మవద్దని ఈటల కోరారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించినంత మాత్రన కరోనా సోకదన్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలని సూచించారు. ఇతర వైరస్‌లతో పోల్చితే కరోనాతో మరణాలు చాలా తక్కువన్న ఈటల.. కరోనాకు మనిషిని చంపే శక్తి లేదని వైద్యులు చెబుతున్నారని తెలిపారు.
ఐసొలేషన్ వార్డులున్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు అనుమతిచ్చామని ఈటల తెలిపారు. వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులూ సేవలు అందించేందుకు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
కోఠిలోని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుచేశామని.. అక్కడ నుంచే 24 గంటలు పర్యవేక్షిస్తామన్నారు. కరోనా నివారణకు నలుగురు ఐఏఎస్ల ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసినట్లు మంత్రి ఈటల ప్రకటించారు.
ఇవీచూడండి: 'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'