ప్రముఖ విద్యావేత్త జక్కంరెడ్డి వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విశ్రాంత ఐఏఎస్ ఎస్.ఆర్.శంకరన్ శిష్యుడిగా, ఎన్‌సీఈఆర్టీ సహాయ సంచాలకుడిగా వెంకటరమణారెడ్డి సేవలందించారు. వెంకటరమణారెడ్డి.. బాల్యంలోనే తండ్రిని కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని వెడిచెర్ల గ్రామానికి చెందిన ఆయన స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. మేనమామల సహకారంతో ఎమ్మెస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. ఆ తర్వాత ప్రభుత్వ అధ్యాపకుడై.. క్రమంగా దేశంలోనే ప్రతిష్ఠాత్మక ఎన్‌సీఈఆర్టీలో సహాయ సంచాలకుడి స్థాయికి ఎదిగారు. ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలోనే ఆయనకు శంకరన్‌తో పరిచయం ఏర్పడింది.
వారిద్దరూ పేదలు, దళితులకు అండగా ఉంటూ వారి హక్కుల సాధనకు కృషి చేశారు. వెంకటరమణారెడ్డి 2002లో ఉద్యోగ విరమణ పొందాక.. తన జీవితాన్ని దళితులు, పేదలకు అంకితం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం తదితర సదుపాయాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందంటూ గళమెత్తారు. హేతువాదం, మానవతావాదంపై అనేక పుస్తకాలు రచించారు. శంకరన్ ఆశయసాధనకు గూడూరు మండలం కొమ్మనేటూరులో 15 ఏళ్ల క్రితం ఎస్.ఆర్.శంకరన్ గ్రామ చైతన్య కేంద్రాన్ని స్థాపించారు. దీని ద్వారా వేలాది మంది గ్రామీణ యువతీయువకులకు టైలరింగ్, డ్రైవింగ్, కంప్యూటర్ తదితరాల్లో శిక్షణ ఇచ్చారు. వందలాది ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. విద్య, వైద్యంపై గ్రామాల్లో చైతన్యం తీసుకొచ్చారు. శుక్రవారం.. కొమ్మనేటూరులో జేవీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: KRMB: శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం లేఖ