Dh srinivasa rao on omicron cases: రాష్ట్రానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 12న రాష్ట్రానికి వచ్చిన.. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు 23 ఏళ్ల యువకుడికి జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిందని డీహెచ్ తెలిపారు. కెన్యా నుంచి వచ్చిన మహిళను టోలిచౌకిలో గుర్తించాం. సోమాలియా నుంచి వచ్చిన యువకుడి ఆచూకీని హైదరాబాద్ పారామౌంట్ కాలనీలో పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ నేరుగా టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నాం.
స్థానికులకు ఎక్కడా సోకలేదు..
ఒమిక్రాన్ ఆంక్షల అనంతరం రాష్ట్రానికి విదేశాల నుంచి మొత్తం 5,396 మంది వచ్చారని పేర్కొన్న డీహెచ్.. అందులో 18 మందికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు తెలిపారు. 15 మందికి ఒమిక్రాన్ నెగిటివ్‌గా తేలినట్లు చెప్పారు. మరో ముగ్గురికి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతం ఇద్దరికి తప్ప.. రాష్ట్రంలో స్థానికులకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఆందోళన కాదు.. అప్రమత్తత అవసరం..
ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ సూచించారు. ఒమిక్రాన్‌పై వైద్యారోగ్యశాఖ సిబ్బంది అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. అధికారులకు సహకరించాలని కోరారు. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నా.. వేగంగా విస్తరిస్తుంది. ప్రజలంతా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. వ్యాక్సిన్ వేసుకున్నా... అప్రమత్తత అవసరమని సూచించారు.
వారిపై చట్టపరమైన చర్యలు..
ఒమిక్రాన్ అంత భయంకరమైనదని కాదని.. కొవిడ్ నిబంధనలతో నియంత్రించవచ్చని డీహెచ్ వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ కూడా గాలి ద్వారానే సోకుతుందన్నారు. పండుగలు, ఫంక్షన్లు కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలన్నారు. ఒమిక్రాన్‌పై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒమిక్రాన్‌పై సీఎం కేసీఆర్.. ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: