మతపరమైన ఊరేగింపుల సమయంలో అనుమతుల మంజూరుకు ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలంటూ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత నివేదికను జూన్ 6వ తేదీ నాటికి సమర్పించాలని ఆదేశిస్తూ... విచారణను వాయిదా వేసింది. మే నెల 2 నుంచి 12 వరకు ఎగ్జిబిషన్ మైదానంలో ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవాల నిర్వహణకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ... శ్రీశ్రీ జగద్గురు ఆది శంకరచార్య భక్త సమాజం, తత్వం ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పి.బంగారయ్యశర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు న్యాయవాది కె. అరవింద్ కుమార్ వాదనలు వినిపించారు.
మే 1న నల్లకుంట శంకరమఠం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వరకు జరిగే శోభాయాత్రకు, మైకు వినియోగానికి పోలీసులు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది మతపరమైన హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. ప్రభుత్వ న్యాయవాది టి. శ్రీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఎగ్జిబిషన్ మైదానంలో ఉత్సవాలు నిర్వహించుకోవడానికి మైక్ వినియోగానికి ఎలాంటి అభ్యంతరంలేదన్నారు. శోభాయాత్ర నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పండగల సందర్భంలో భక్తులు శోభాయాత్రల నిర్వహణ కోసం ఈ కోర్టును ఆశ్రయిస్తుంటారని... ఏకరూప నిబంధనలు లేకపోవడంతో అనుమతులు మంజూరు చేయడం, నిరాకరించడం అనేవి ఒక్కో కేసుల్లో ఒక్కో రకంగా ఉంటున్నాయని... అందువల్ల అనుమతుల జారీకి మార్గదర్శకాల రూపకల్పన తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.
గతంలో కొన్ని శోభాయాత్రలకు ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చిందో ప్రభుత్వం పేర్కొనలేదని... ఈ కేసులో తిరస్కరించేందుకున్న కారణాలపై స్పష్టత లేదని న్యాయస్థానం తెలిపింది. నిర్ణయం తీసుకోవడంలో సహేతుకత లేదని ఆక్షేపించింది. రద్దీ సమయాల్లో యాత్ర వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగించడానికి అనుమతించరాదని... అదే సమయంలో పిటిషనర్ల మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన హక్కులకు భంగం కలిగించకుండా తగిన పరిమితులతో అనుమతించవచ్చన్నారు. శంకరాచార్య జయంత్యుత్సవాల నిర్వహణ నిమిత్తం తగిన బందోబస్తుతో పాటు మైక్‌ను అనుమతించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ చూడండి: