ETV Bharat / city

నాటుకోడి.. నాటుకోడే.. తింటే వదిలిపెట్టరంతే!

మాంస ప్రియులు అప్పుడప్పుడైనా నాటుకోడి తినాలనుకుంటారు. ‘ఎన్ని రకాల మాంసాలు తిన్నా..దాని రుచి దానిదే’ అని లొట్టలేసేవారూ ఉన్నారు. పొయ్యిమీద ఉడికేటప్పుడే ఓ ముక్క నోట్లో వేసుకునే వారూ లేకపోలేదు. ‘పెట్ట’కోడి రుచి మరీ ప్రత్యేకం.

author img

By

Published : Dec 20, 2020, 11:45 AM IST

craze-for-natu-kodi-in-telangana-and-andhra-pradesh
నాటుకోడి తింటే వదిలిపెట్టరంతే

తెలుగు రాష్ట్రాల్లో నాటుకోడి మాంసానికి గిరాకీ క్రమేపీ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, ముంబయి వంటి మహా నగరాల్లో వాటికోసం ఎగబడుతున్నారు. గిరాకీకి తగిన సంఖ్యలో కోళ్లు దొరక్కపోవడంతో మాంసం ధర ఆకాశాన్నంటుతోంది. బ్రాయిలర్‌ మాంసం కిలో ధర రూ.200 ఉంటే నాటుకోడి మాంసం ధర రూ.300 నుంచి 600 వరకూ పలుకుతోంది. అందుకే తెలుగు రాష్ట్రాల రైతులు నాటుకోళ్ల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు.

సేద్యానికి అనుబంధంగా పందిళ్లలోనూ పెంచుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. కొందరైతే మధ్యప్రదేశ్‌కు ప్రత్యేకమైన కడక్‌నాథ్‌(నలుపు రంగు) జాతి రకాలు పెంచుతూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ మాంసాన్ని కొందరు వారం రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి తెప్పించుకుంటున్నట్టు పెంపకందారులు చెబుతున్నారు. ముంబయి నగరంలో ఈ కోడి మాంసం ధర రూ.800 వరకూ పలుకుతోందంటున్నారు.

విద్యావంతులూ పెంపకం వైపు

వీటి పెంపకం పల్లెల్లో రైతుల వ్యాపకం అనుకునే రోజులు పోయాయి. చెప్పుకోదగ్గ ఆదాయం వస్తుండటంతో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు కూడా అవకాశమున్న ప్రాంతాల్లో పెంచుతున్నారు. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ జరోమ్‌ సోరంగ్‌ తూర్పు సింగ్‌బూమ్‌ ప్రాంతంలో తనకున్న రెండెకరాల బీడు భూమిలో 100 కోళ్లతో పెంపకం ప్రారంభించి, నాలుగు నెలల వ్యవధిలోనే రూ.60 వేలు సంపాదించారని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఇటీవల ప్రశంసించింది. అప్పటిదాకా ఆ ప్రాంతంలో వీటి పెంపకాన్ని పెద్దగా పట్టించుకోని వారు కూడా ఇప్పుడు ఆయన్ని అనుసరిస్తూ ఈ తరహా కోళ్ల ఫారాలను ప్రారంభించినట్టు తెలిపింది.

ప్రదీప్‌ అనే యువకుడు హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా మంగల్‌పల్లి గ్రామంలో నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటుచేసి ఉపాధి పొందుతుండగా, మహబూబ్‌నగర్‌ జిల్లా నర్వ మండలం పెద్దకడుమూరు గ్రామంలో నర్సింహ అనే యువకుడు నాటుకోళ్ల పెంపకాన్ని వ్యాపకంగా మార్చుకుని ఆదాయం పొందుతున్నారు. ‘మూణ్నెల్లపాటు పిల్లలను దాణావేసి పెంచడానికి సగటున రూ.120 నుంచి 130 దాకా పెట్టుబడి పెడుతున్నాం. కిలో కోడి ధర రూ.250 నుంచి 300 వరకూ పలుకుతున్న నేపథ్యంలో నష్టమే రాదని’ పెంపకందారులు పేర్కొంటున్నారు.

జాతి కోళ్ల వైపు మొగ్గు

జాతి కోళ్ల పెంపకంలో కొన్ని రకాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎవరి దొడ్డి నుంచి తెచ్చారనే దాన్నిబట్టి వీటి ధరలు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు ఈ తరహా కోళ్ల పెంపకంపై అత్యధిక శ్రద్ధ పెడతారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందేలకు పుంజులను సిద్ధం చేస్తారు. వీటిపై రూ.లక్షల్లో పెట్టుబడిపెడతారు. వీరి నుంచి కొందరు పుంజులను కొనుగోలు చేసి పెంచుతారు. కొన్ని జాతుల పుంజులకు రంగు ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. ఆయా జాతుల పిల్లలు రూ.5 వేల నుంచి రూ.5లక్షల వరకు ధర పలుకుతాయని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

పరిశోధనల్లో ‘కోడి’

భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌)కి చెందిన ‘జాతీయ కోళ్ల పరిశోధన కేంద్రం’(డీపీఆర్‌సీ) రాజేంద్రనగర్‌లో ఉంది. ఈ కేంద్రానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా మరో 24 ప్రాంతీయ పరిశోధన కేంద్రాలున్నాయి. వీటిలో కొత్తరకం సంకరజాతి నాటుకోళ్ల ఉత్పత్తికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వనరాజా, గిరిప్రియ తదితర పేర్లతో ఈ కేంద్రం విడుదల చేసిన రకాల కోళ్లను రైతులు దేశవ్యాప్తంగా పెంచుతున్నారు.

కడక్‌నాథ్‌ కోళ్ల మాంసానికి ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, వీటిని సాధారణ నాటుకోళ్లతో సంకరీకరణ చేసి ‘నర్మద నిధి’ పేరుతో కొత్త సంకరజాతి కోడిని ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తలు సృష్టించారు. జబల్పూర్‌లోని కోళ్ల పరిశోధనా కేంద్రంలో సృష్టించిన ‘నర్మదనిధి’ కోడి మాంసానికి సైతం ఇదే తరహాలో ఆదరణ పెరుగుతోంది.

స్వచ్ఛంద సంస్థ సహకారం

హైదరాబాద్‌, విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ, వరంగల్‌ సహా అన్ని నగరాల్లో నాటుకోడి మాంసానికి ఉన్న గిరాకీ అంతాఇంతా కాదు. ఆదివారాల్లో అయితే మరీనూ. ఈ క్రమంలో చుట్టుపక్కల పల్లెల్లో కోళ్లు పెంచుకున్న వారు అమ్మకం కోసం ఆదివారం నగరాల రోడ్లపై బారులుదీరుతుండటం ఇటీవల బాగా పెరిగింది. గిరాకీ దృష్ట్యా సుస్థిర వ్యవసాయ వేదిక అనే స్వచ్ఛంద సంస్థ పలు గ్రామాల్లో రైతులు, యువకులకు నాటుకోళ్ల పెంపకంపై అవగాహన కల్పిస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో పెంచుతున్న వారు కిలో బరువున్న బతికున్న కోడిని కిలో రూ.250 దాకా విక్రయిస్తున్నట్లు వేదిక ప్రతినిధి యాదవరెడ్డి చెప్పారు.

పీచు, రుచి ఎక్కువ

బ్రాయిలర్‌ కోళ్లకు నాణ్యమైన దాణా వేసి ఫాంలలో పెంచుతారు. వాటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. నాటుకోళ్లు సహజ వాతావరణంలో ఎక్కువ రోజులు పెరుగుతాయి. ఇది అనేక రకాల క్రిమికీటకాలు, ఆకులు, గింజలను తినడం వల్ల దాని మాంసంలో పీచు పదార్థం అదనంగా ఉంటుంది. పైగా వీటి మాంసాన్ని ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల కూరలో వేసిన సుగంధ ద్రవ్యాలు బాగా కరిగి, కలసిపోవడంతో అదనపు రుచి వస్తుందని పరిశోధనల్లో గుర్తించాం. అలాగని నాటుకోడి మాంసం తినడమే మంచిదనే ప్రచారంలో నిజం లేదు. బ్రాయిలర్‌, నాటుకోళ్ల పోషక విలువల్లో తేడా ఉండదు.

- ఎస్‌.వి.రామారావు, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ కోళ్ల పరిశోధన కేంద్రం

చెన్నైలో కడక్‌నాథ్‌ గుడ్డు రూ.25

కడక్‌నాథ్‌, అశీలు రకాలను ఇంక్యుబేటర్‌లో పొదిగించడం ద్వారా సంతతి పెంచుతున్నాం.రోజుకు 35 గుడ్లు ఒక్కోటి రూ.10 చొప్పున అమ్ముతున్నాం. బెంగళూరులో రూ.12 నుంచి రూ.15 వరకు లభిస్తోంది. కడక్‌నాథ్‌ కోళ్లు, కోడిగుడ్లకు చెన్నైలో గిరాకీ ఎక్కువగా ఉంది. అక్కడ గుడ్డు రూ.25 వరకు పలుకుతోంది. కోడిపిల్లల్లో రోగ నిరోధకశక్తిని పెంచేందుకు అయిదు రోజులకోసారి పసుపు, వెల్లుల్లి, అల్లం ముద్దను నీళ్లలో కలిపి తాగిస్తున్నాం. సహజసిద్ధ మందులనే ఎక్కువగా వాడుతున్నాం.

- జ్ఞాన ప్రకాశ్‌, కలికిపురం, చిత్తూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.