రాజకీయ చదరంగంలో పోలవరం నిమజ్జనానికి గురవుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని.. కేంద్ర ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పిందని మండిపడ్డారు.
"భూసేకరణకు మా బాధ్యత లేదని కేంద్రం తేల్చేసింది. నిర్వహణా సమస్యలు, ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రపంచంలో ఎక్కడైనా ప్రాజెక్టైనా పూర్తవుతుందా? ఆకాశంలో తప్ప భూమి మీద సాధ్యం కాదు. బాధ్యాతారాహిత్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే.. ఏపీలో ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నాయకులు కేంద్రం పైన యుద్ధం చేయకుండా ఒకరిమీద మరొకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఒకరి తలలు మరొకరు నరుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు."
-నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
తమిళనాడును చూసి ఏపీ నేతలు కొన్ని విషయాలు నేర్చుకోమని హితవు పలికారు. వారి మధ్య ఎన్ని విబేధాలున్నప్పటికీ అభివృద్ధికోసం ఒకటై నిలబడుతున్నారని గుర్తు చేశారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే తెలుగు ప్రజలు నష్టపోతారన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: నేపాలీ ముఠాలో ఐదుగురిని పట్టుకున్నాం: సీపీ మహేశ్ భగవత్