అనంతపురం జిల్లాలో ఓ కొవిడ్ బాధితుడు అంబులెన్స్ కోసం ఐదు గంటలకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. చివరకు ఈటీవీ చొరవతో.. అధికారులు అంబులెన్స్ సమకూర్చారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కరోనా లక్షణాలతో ఓ ఉపాధ్యాయుడు పది రోజుల క్రితం హిందూపురం కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం.. హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందవచ్చని వైద్యులు అక్కడి నుంచి ఇంటికి పంపించారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితునికి ఆదివారం నుంచి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. సోమవారం సమస్య తీవ్రం కావడం వల్ల బాధితుణ్ని హిందూపురం తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుని కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం 4 గంటలకు అంబులెన్స్ కోసం 108కు ఫోన్ చేశారు. అయినా ఎంత సేపటికీ అంబులెన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు బాధితుని పరిస్థితిపై ఆందోళన చెందారు.
స్పందించిన అధికారులు
అంబులెన్స్ రాకపోవడంపై ఈటీవీలో కథనాన్ని చూసిన అధికారులు వెంటనే అంబులెన్స్‌ను సమకూర్చారు. వెంటనే బాధితుణ్ని హిందూపురం తరలించారు.