కరోనా రాకాసి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. అప్పటివరకు కలో గంజో తాగి ఆనందంగా ఉన్న వారిని విషాదంలోకి నెడుతోంది. హైదరాబాద్ మల్లాపూర్‌లోని.. నాగలక్ష్మినగర్‌కు చెందిన గుజ్జ పాండు పుట్టుకతోనే దివ్యాంగుడు. ఇసుక వ్యాపారం చేసే పాండు.. భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులతో హాయిగా జీవించేవాడు. ఇటీవల ఆయనకు కొవిడ్ సోకడంతో ఐదు రోజలు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఊపిరితీసుకోవడం కష్టంగా మారడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి పంపగా... ఆక్సిజన్ కొరతతో చేర్చుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే చొరవతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆలస్యం కావడంతో పాండు కన్నుమూశాడు.
పెళ్లిరోజే చివరి రోజు..
పాండు మరణించినరోజు అతని పెళ్లి రోజు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లేటప్పుడు.. పెళ్లిరోజు వరకు తిరిగొస్తానని భార్య వసంతకు మాటిచ్చాడు. కానీ అదే పెళ్లిరోజు భర్త మరణ వార్తను విని ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదించింది. భర్త జ్ఞాపకాలతో చిన్నారులు, అత్తామామలను చూస్తూ దుఃఖాన్ని దిగమింగుకుంటోంది. పిల్లలు, తల్లిదండ్రుల కోసం.. చివరి క్షణాల్లో పాండు తపించాడని అతని భార్య చెబుతోంది. అడుగడుగునా నిర్లక్ష్యం.. పాండును మరణానికి దగ్గర చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ తమ కుటుంబ ఆశల సౌధాన్ని కూల్చివేసిందని రోధిస్తోంది. ఇక నాన్న తిరిగిరాడన్న విషయం తెలిసి ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఇంటి కోసం దాచిన డబ్బంతా వైద్యానికే..
ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న పాండు అకాలమరణం కుటుంబాన్ని చీకట్లోకి నెట్టిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తమను ఏ లోటూ లేకుండా చూసుకున్నాడని గుర్తుచేసుకున్నారు. కోడలు, చిన్నారుల పరిస్థితి తలుచుకుంటూ కుంగిపోతున్నారు. ఇళ్లు కట్టుకుందామని తెచ్చిన డబ్బులు మొత్తం కుమారుని వైద్యానికే ఖర్చుచేసినా ప్రాణం దక్కలేదని గుండెలవిసెలా రోధిస్తున్నారు..
కుటుంబానికి అన్ని విధాల ఆసరాగా నిలిచే వ్యక్తి లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పిల్లల చదువులకు, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని అర్థిస్తున్నారు.
ఇవీ చూడండి: పెద్దదిక్కు ప్రాణాలు హరించి.. కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసి