Biryani Fight in Hyderabad : ఐదు రూపాయల కోసం జరిగిన గొడవ.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి తిన్నదానికంటే రూ.5.50 ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్-2 బెంచ్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు తీర్పు వెలువరించారు.
Hyderabad Consumer Court : ఫిర్యాదీపై పరుష పదజాలం ఉపయోగించడంతో పాటు సేవల్లో లోపం కలిగించినట్లు గుర్తించి.. అదనంగా వసూలు చేసిన రూ.5.50కి 10శాతం వడ్డీతో చెల్లించడంతోపాటు ఫిర్యాదీకి రూ.5వేలు పరిహారం, జిల్లా వినియోగదారుల సంరక్షణ మండళ్ల సంక్షేమం కోసం రూ.50వేలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చెల్లించాలని ఆదేశించారు.
Consumer Court in Hyderabad : చిలుకూరి వంశీ ఉస్మానియా వర్సిటీలోని గౌతమి హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నారు. తన నలుగురు స్నేహితులతో కలిసి తిలక్‌నగర్‌లో ఉన్న లక్కీ బిర్యానీహౌజ్‌కు వెళ్లారు. బిల్లు రూ.1,075 జీఎస్టీ కలుపుకొని మొత్తం రూ.1,127.50 అయ్యింది. మినరల్ వాటర్ బాటిల్‌కు అదనంగా రూ.5 వసూలు చేశారని గుర్తించారు. ప్రశ్నించగా బిర్యానీ హౌజ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బలవంతగా తన నుంచి రూ.5.50 అదనంగా వసూలు చేశారని, స్నేహితుల ముందు తనను ప్రతివాద సిబ్బంది అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదీ అందించిన సాక్ష్యాధారాలు పరిశీలించిన బెంచ్..ప్రతివాద సంస్థ సేవల్లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఇకపై ఈ పొరపాటు చేయొద్దంటూ మందలిస్తూ 45 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.