ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఈ నెల 19 లోపు పరిష్కరించకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గడువు విధించారు. గృహనిర్భందం చేసినప్పటికీ... ముందుగా చెప్పినట్లు ఈ నెల 21న పోలీసు వలయాన్ని దాటుకొని ప్రగతి భవన్ ముట్టడించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో విభేదాలను తెరపైకి తెచ్చింది. రేవంత్ తీరుపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమం కాదు కదా... ఎందుకు వెళ్లారని ఆందోళనలో పాల్గొన్న వారిని నిలదీసినట్లు తెలుస్తోంది.
నేతల భేటీ... ముట్టడిపైనే చర్చ
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె అయినందున... ఆర్టీసీ ఐకాసా చేపట్టే కార్యక్రమాల్లో కాంగ్రెస్ భాగస్వామ్యం కావాల్సి ఉందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఏది చేసినా... కార్మికులకు మేలు చేసేదిగా ఉండాలని... రాజకీయాలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. తెరాస మినహా సమ్మెకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ... ప్రత్యేకంగా ప్రగతిభవన్ ముట్టడింల్సిన అవసరమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక రోజునే ముట్టడికి రేవంత్ ఎలా పిలుపునిస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో విస్తృతంగా చర్చించి అందరినీ కలుపుకొనిపోతే విజయవంతమయ్యేదని అభిప్రాయపడుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో... ప్రగతి భవన్ ముట్టడిపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం
ప్రగతిభవన్ ముట్టడి ప్రకటన చేసే ముందు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో చర్చించి వారితో కలిసే రేవంత్‌రెడ్డి మీడియాకు ప్రకటించారు. కానీ గాంధీభవన్ నుంచి పార్టీ నాయకులకు, క్యాడర్‌కు అధికారికంగా సమాచారం వెళ్లలేదు. పోలీసులు ముందస్తుగానే రేవంత్‌ను గృహనిర్భందం చేశారు. అయినప్పటికీ ద్విచక్రవాహనంపై ప్రగతి భవన్‌కు చేరుకొని హల్‌చల్ చేశారు. జగ్గారెడ్డి సహా పలువురు నేతలు అరెస్టయ్యారు. కానీ సీనియర్లు మాత్రం అంటీముట్టనట్లు వ్యవహరించారు. కార్యక్రమం విజయవంతమైందని రేవంత్ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌లో ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో వేచి చూడాలి.
ఇదీ చూడండి: 'కార్మికుల డిమాండ్ల పరిశీలన కోసం ఆర్టీసీ ఈడీలతో కమిటీ'