Attack on Nara Lokesh: ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీద దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్‌పై దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు అందజేశారు. వైకాపా నేతలు, ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు లోకేశ్‌పై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేయడం సమంజసం కాదని పార్టీ నేతలు మండిపడ్డారు. మంగళగిరిలో పనిచేసిన ఏ శాసనసభ్యులు ఈ విధంగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ తరహా ఘటనలపై అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
ఎం జరిగిందంటే..: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా నేత లోకేశ్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న వైకాపా శ్రేణులు.. తెదేపా శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు.., తెదేపా వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. లోకేశ్‌తో పాటు తెదేపా శ్రేణుల పైకి వైకాపా శ్రేణులు రాళ్లు విసిరారు. అడ్డుకున్న పోలీసులు వైకాపా శ్రేణులను నిలువరించారు. దాడిలో ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వైకాపా నాయకులు విసిరిన ఓ పెద్దరాయి లోకేశ్ సమీపంలో పడింది. తృటిలో ఆయన దాన్నుంచి తప్పించుకున్నారు. రాళ్ల దాడిలో హెడ్‌కానిస్టేబుల్ మోహన్‌రావు తలకు గాయమైంది. రాయి దూసుకురావడంతో దుగ్గిరాల ఎస్సై శ్రీనివాసరెడ్డి తలపై టోపీ లేచిపోయింది.
ఇదీ చదవండి: యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి