- సీఐ హోదాను అడ్డంపెట్టుకొని నాగేశ్వరరావు ఓ వివాహితను లైంగికంగా వేధించాడు..
- మల్కాజిగిరి ఎస్సై(సస్పెండెడ్) విజయ్ మిర్యాలగూడలో పనిచేసినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఓ అమ్మాయిని వంచించాడు..
- పెద్దపల్లి డీసీపీగా పనిచేసిన రవీందర్ వివాదాస్పద భూముల్ని గుర్తించి కొనుగోలు చేశాడు..
వీరంతా ఎప్పటి నుంచో ఆయా వ్యవహారాలను సాగించినా చాలారోజుల తర్వాతగానీ బహిర్గతం కాలేదు. ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ అందుబాటులో లేకపోవడం ఈ ఆలస్యానికి ఓ ప్రధాన కారణం. వాస్తవానికి పోలీసుల అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసేందుకు కంప్లెయింట్ అథారిటీ ఉండాలనేది సుప్రీంకోర్టు ఆదేశం. ఆ మేరకు తెలంగాణాలోనూ రాష్ట్రస్థాయితోపాటు రీజియన్లవారీగా అథారిటీలున్నాయి. కానీ, ఉత్తర్వుల్లోనే అవి దర్శనమిస్తాయి. ఎక్కడా వాటి ఉనికి కానరాదు. న్యాయస్థానం ఆదేశాలతో హోంశాఖ హడావుడిగా జీవో ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
complaint authority for Police : రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ భద్రత కమిషన్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2006లోనే ఆదేశించింది. తెలంగాణాలోనూ రాష్ట్ర భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వ్యాజ్యం దాఖలు కావడంతో 2016లో హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. అయితే ప్రభుత్వం అందులో విఫలం కావడంతో 2017లో హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. ఈ క్రమంలో కమిషన్ ఏర్పాటుకు గతేడాది జనవరిలో నాలుగు వారాల గడువు విధించింది. అప్పటికీ ఏర్పాటు కాకపోవడంతో చివరిసారిగా మరో నాలుగు వారాల సమయం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో హోంశాఖ గతేడాది జులై 9న హడావుడిగా రాష్ట్ర స్థాయి భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖలో సంస్కరణలపై సిఫార్సు చేయడంతోపాటు ఈ వ్యవస్థలోని లోపాల్ని గుర్తించి సరిచేయడానికి తగిన సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ కమిషన్‌ది. దీనికితోడు పోలీసులపై ఫిర్యాదులకు రాష్ట్ర స్థాయి, రెండు రీజియన్ల స్థాయిలో అథారిటీలను ఏర్పాటు చేసింది. కమిషన్, అథారిటీల విధివిధానాలపై త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొంది. వ్యవహారం అంతటితో ఆగిపోయింది.
కమిషన్‌లో ఎవరున్నారంటే.. కమిషన్ ఎక్స్ అఫిషియో ఛైర్మన్‌గా హోంమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు, సీఎస్ సభ్యులు. ఎక్స్‌అఫిషియో కార్యదర్శిగా డీజీపీని నియమించారు. ప్యానల్ సభ్యులుగా ఉస్మానియా వర్సిటీ మాజీ ఉపకులపతి, ఓ జర్నలిస్ట్ ఉన్నారు.
ఫిర్యాదు అథారిటీలు ఇలా.. రాష్ట్రస్థాయితోపాటు జిల్లాలు, కమిషనరేట్ల స్థాయిలో ఫిర్యాదుల పర్యవేక్షణకు వేర్వేరు అథారిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలు, కమిషనరేట్ల స్థాయిలో ఫిర్యాదుల పర్యవేక్షణకు హైదరాబాద్, వరంగల్ రీజియన్లకు వేర్వేరుగా అథారిటీలు ఏర్పాటయ్యాయి.