సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోశ్ బాబు కుటుంబ సభ్యుల్ని వారి నివాసంలో... బంధువులు, సన్నిహితులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పరామర్శించారు. సూర్యాపేట విద్యానగర్లోని ఆయన స్వగృహానికి... ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. వీధి చుట్టూ ఎక్కడికక్కడ... బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా కల్నల్ ఇంటి వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సోడియం హైపోక్లోరైడ్తో పరిసరాలను పిచికారీ చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమర సైనికాధికారి సంతోశ్ బాబు అంత్యక్రియలు... సూర్యాపేట సమీపంలోని కేసారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. సైనిక, అధికార లాంఛనాల నడుమ ఉదయం ఎనిమిది గంటలకు తుది ఘట్టం నిర్వహించనున్నారు. ఇందుకు గాను అక్కడ ఏర్పాట్లు చేశారు. సైనిక ఉన్నతాధికారి సమక్షంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్... ఏర్పాట్లు పరిశీలించారు. ఉదయం నిర్వహించే తుది వీడ్కోలు ప్రక్రియకు ముందు... భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు సంతోష్ నివాసానికి చేరుకుని... ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్ బాబు కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయేలా... సూర్యాపేట వైద్య కళాశాల లేదా స్థానికంగా ఏదైనా ప్రతిష్ఠాత్మక సంస్థకు ఆయన పేరు పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో విద్యనభ్యసించి ఐదేళ్లలోనే అందులో బోధకుడిగా మారడం... అమరవీరుడి ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనమని కొనియాడారు. కల్నల్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ సోనియాగాంధీ పంపిన సందేశాన్ని... చదివి వినిపించారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: కల్నల్ సంతోశ్కు ప్రముఖుల నివాళి... సూర్యాపేటకు పార్ధివ దేహం