ముక్కు అదే పనిగా కారడం...లేదా దిబ్బడెయ్యడం జరిగినప్పుడు కొబ్బరినూనెలో మూడుచుక్కల యూకలిప్టస్ నూనె కలిపి ఛాతీకి, ముక్కుకు రాసుకుని పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెని నేరుగా రాసుకొంటే ఆ మంటకి చర్మం కందిపోతుంది కాబట్టే ఇలా మరొక నూనెతో కలిపి రాసుకోవాలి. అప్పుడు దాని గాఢత తగ్గుతుంది. ఫలితమూ ఉంటుంది.
ఒళ్లు నొప్పులూ, మెడనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి ఉన్నప్పుడు బాదం నూనెలో రెండు చుక్కల యూకలిప్టస్ నూనెని కలిపి అక్కడ రాసి మర్దన చేయాలి. ఉపశమనం దొరుకుతుంది.
ఈ కాలంలో కాళ్ల పగుళ్లు, ఇన్ఫెక్షన్లు వంటివి ఇబ్బందిపెడతాయి. ఇలాంటప్పుడు కొబ్బరినూనెలో రెండు చుక్కల యూకలిప్టస్ నూనె కలిపి రోజూ రాత్రి పూట కాళ్లకు రాసుకుని సాక్సులు వేసుకుంటే సమస్య దూరమవుతుంది.
జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్‌ని జేబురుమాల్లో వేసుకుని వాసన చూసినా చక్కని ఉపశమనం కలుగుతుంది. లేదా మరిగే నీళ్లల్లో మూడు చుక్కలు చేర్చి ఆవిరి పడితే రొంప ఎగిరిపోయి ముక్కు కారడం తగ్గుతుంది.