KCR Meets Uddhav Thackeray : ఈనెల 20 ముంబయి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వార్ధా నదిపై ఆనకట్ట గురించి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించే అవకాశం ఉంది. ప్రాణహితపై ఆనకట్ట నిర్మించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం సాంకేతికంగా కొంత ఇబ్బంది కావడంతో పాటు ఖర్చు ఎక్కువకావడంతో తమ్మిడిహట్టి ఎగువన వార్ధా నదిపై నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్ తయారుచేస్తున్నారు.
వార్ధా నదిపై ఆనకట్ట గురించి చర్చ..
KCR Talks About Dam on Wardha river : ముంబయి పర్యటనలో రాజకీయ పర, పాలనాపర అంశాలతోపాటు.. వార్ధా నదిపై నిర్మించనున్న ఆనకట్టపైనా ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ చర్చించే అవకాశముందని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. నదుల అనుసంధానంపై రేపు దిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నిర్వహించే సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ హాజరు కావడం లేదు ఆయనకు బదులుగా.. అంతర్ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తోంది. నదుల అనుసంధానంపై గతంలో చెప్పిన వాదనను మరోమారు సమావేశంలో వినిపించనుంది. నీటి లభ్యతను పక్కాగా నిర్ధరించడంతో పాటు రాష్ట్ర అవసరాలు తీరాకే మిగులు జలాలు ఉంటే అనుసంధానానికి అభ్యంతరం లేదని చెప్పే అవకాశం ఉంది.