భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి పెరుగుతున్నందున యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..
బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో... తక్షణమే పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్మల్ పట్టణం ఇప్పటికే నీటమునిగిందన్న ముఖ్యమంత్రి... అక్కడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని కేసీఆర్ సూచించారు.
ఇళ్లలో ఉండటమే క్షేమం...
గోదావరితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయన్న సీఎం కేసీఆర్... ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు తెరుస్తున్నారన్నారు. రాష్ట్రంలోకి వరద ఉద్ధృతి మరింత పెరగనుందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెరాస నేతలు పర్యవేక్షించాలని సూచించిన సీఎం... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు బయటకు వెళ్లకుండా... ఇళ్లలో ఉండటమే క్షేమమని సూచించారు. వాగులు, వంకలన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.