దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. తొలిరోజు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగే భారీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ప్రారంభిస్తారు. శాసనసభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నగరపాలక మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 85 మంది వీణ కళాకారులతో దేశభక్తి గీతాలు, ఇసుక కళ (సాండ్ ఆర్ట్)లో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు, మహిళా యోధుల జీవితాలపై పద్మశ్రీ అలేఖ్య పుంజల ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన, లేజర్‌షో, దేశభక్తి గీతాల ప్రదర్శనలుంటాయి. స్వతంత్ర వజ్రోత్సవాలపై కేసీఆర్ సందేశమిస్తారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 9 నుంచి 21 వరకు రాష్ట్రంలో 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన 'గాంధీ' చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15నుంచి పింఛనుకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో నిర్వహించే రోజువారీ కార్యక్రమాలు
- ఆగస్టు 8న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవం
- 9 నుంచి ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ
- 10న గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
- 11న ఫ్రీడంరన్ నిర్వహణ
- 12న రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలు
- 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
- 14న సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారులతో నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణసంచాతో వెలుగులు..
- 15న గోల్కొండ కోటతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు
- 16న ఏకకాలంలో ఎక్కడివారక్కడ.. తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాలు
- 17న రక్తదాన శిబిరాలు
- 18న ఫ్రీడంకప్ క్రీడా పోటీలు
- 19న దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో, జైళ్లలో పండ్లు, స్వీట్ల పంపిణీ
- 20న దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు
- 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు
- 22న ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు
ఇదీ చూడండి: నేతన్నకు మద్దతుగా ప్రభుత్వాధికారులు.. ట్విటర్ ట్రెండింగ్‌లో ఛాలెంజ్‌లు..