CM KCR Comments: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. 75 ఏళ్ల అనుభవంలో దేశం అనుకున్న రీతిలో ముందుకు సాగలేదన్న ఆయన.. వనరులున్నా ఉపయోగించుకోలేని దుస్థితని వ్యాఖ్యానించారు. గణాంకాలు తప్పని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. భారతదేశం పేదరికంలో లేదని.. ప్రభుత్వాల ఆలోచనలు అలా ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. త్వరలో ముంబయి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో చర్చిస్తానని చెప్పారు. మార్పు దిశగా తన వంతు బాధ్యత పోషిస్తానన్న ఆయన... అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకూ సిద్ధమని ప్రకటించారు.
తుపాకీలు పట్టాల్సిన అవసరం లేదు..
ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్స్‌గా అభివర్ణించడం తగదని సీఎం అన్నారు. యూపీ ఎన్నికల్లో భాజపాకు ప్రజల మద్దతు తగ్గుతుందన్న ఆయన... భాజపా సర్కార్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. సమయం వచ్చినపుడు దేశ ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. విప్లవాల కోసం ఇప్పుడు తుపాకీలు పట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
'కొత్త రాజ్యాంగం అవసరం'
దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఈ విషయంపై విస్తృత చర్చ జరగాలని అభిలాషించారు. ఉమ్మడి జాబితా పేరిట కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను హరిస్తున్నాయని ఆక్షేపించారు. కేంద్ర విధానాల వల్లే భారత్‌లో నీటి యుద్ధాలు వస్తున్నాయన్న కేసీఆర్.. రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు..
కేంద్ర జల విధానాలను పూర్తిగా మార్చాల్సి ఉందని సీఎం అన్నారు. దేశంలో 4.1 లక్ష మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉందని... 2 లక్షల మెగావాట్ల విద్యుత్ కూడా వినియోగించుకోవట్లేదని చెప్పారు. ఈ విషయం అబద్దమని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా అని సీఎం సవాల్ విసిరారు. ఈసారి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సీఎం కేసీఆర్.. సాధారణ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో తెరాస గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా..
"నీళ్లు అందుబాటులో ఉన్నా సాగు, తాగునీరు అందట్లేదు. విద్యుత్ ఉన్నా 65 శాతం దేశ ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఎంతకాలం దేశ ప్రజలను అంధకారంలో ఉంచుతారు. దేశంలో మార్పు కావాలని ప్రజలను కోరుతున్నా. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా మారవచ్చు. దేశ పాలనలో కాంగ్రెస్, భాజపా రెండూ విఫలమయ్యాయి. పాలనలో వైఫల్యం వల్లే దేశంలో దరిద్రం, నిరుద్యోగం, విభజించి పాలించు అనేది భాజపా విధానం. కేంద్ర విధానాల వల్ల దేశం పురోభివృద్ధి సాధిస్తుందా..? దేశంలో అతిపెద్ద మార్పు రావాల్సి ఉంది. మేము చూస్తూ ఊరుకోం.. త్వరలో తప్పకుండా ఉద్యమిస్తాం. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి ఉద్యమం చేశాం. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. ప్రతి రంగానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశ ప్రజల్లో పరివర్తనతో పాటు అంతా ఏకతాటిపైకి రావాలి. దేశంలో మార్పు కోసం సంప్రదింపులు జరుపుతున్నా. సహజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. పార్లమెంటు వేదికగా బడ్జెట్ ద్వారా అబద్దాలు ప్రచారం చేశారు. పేదలు, రైతులు అంటే కేంద్రానికి ఎలాంటి గౌరవం లేదు. దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా 40 కోట్లకు పైగా ఉంది. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు రూ.12,800 కోట్లు కేటాయించారు."
- సీఎం కేసీఆర్
రెండేళ్లలో దేశంలో పురోభివృద్ధి..
దేశంలోని యువత మేల్కొని వాస్తవాలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశంలో మార్పు కోసం విప్లవం రావాల్సిన అసరముందన్నారు. యువత భవిష్యత్తు కోసం పోరాడకపోతే మార్పు రాదని హెచ్చరించారు. దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి అందుబాటులో ఉందని.. ప్రస్తుతమున్న నీటి లభ్యతతో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వగలమన్నారు. దేశంలో ఉన్న వనరులతో రెండేళ్లలో పురోభివృద్ధి సాధించగలమని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: